Baahubali The Epic: బాహుబలి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న.. ఇంటర్వెల్‌లో స్పెషల్ ట్రీట్
Baahubali The Epic: భారతీయ చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఇప్పుడు కొత్తరూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు భాగాలను కలిపి, కీలకమైన మార్పులతో రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్ వెర్షన్’ నేటి (గురువారం) రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో అన్ని ఫార్మాట్లలో విడుదల కానుంది.
కొద్ది రోజులుగా ఈ ప్రత్యేక వెర్షన్ చివరిలో ‘బాహుబలి 3’ గురించిన అధికారిక ప్రకటన ఉంటుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే, ఈ పుకార్లపై నిర్మాత శోభు యార్లగడ్డ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌పై ఇంకా విస్తృతమైన కసరత్తు చేయాల్సి ఉందని, ప్రస్తుత ఎడిట్‌లో అలాంటి ప్రకటన ఏదీ లేదని ఆయన ధృవీకరించారు.
‘బాహుబలి 3’ ప్రస్తావన లేకపోయినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక స్పెషల్ సర్ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని శోభు యార్లగడ్డ ఇటీవల హింట్ ఇవ్వడంతో అభిమానుల ఆసక్తి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానాల చిట్‌చాట్ వీడియో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో, సినిమా నిర్మాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వారు పంచుకున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, *‘బాహుబలి: ది ఎపిక్ వెర్షన్’*ను మరింత పదునుగా, సూటిగా ఉండేందుకు అవంతిక లవ్ స్టోరీతో పాటు, కొన్ని పాటలు, ఇతర సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించినట్లు వెల్లడించారు. అలాగే, ‘బాహుబలి 3’ ప్రకటన గురించి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అయితే, శోభు చెప్పిన సర్ప్రైజ్‌పై మాత్రం రాజమౌళి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
ఆ స్పెషల్ సర్ప్రైజ్ మరేదో కాదు, ‘బాహుబలి ఎపిక్ వెర్షన్’ ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శించనున్న 3D యానిమేషన్ టీజర్ అని రాజమౌళి ధృవీకరించారు. ఈ టీజర్‌తో బాహుబలి యూనివర్స్ కొత్త దిశలో కొనసాగనుందని ఆయన తెలిపారు. ఈ యానిమేషన్ సీక్వెన్స్‌ను దర్శకుడు ఇషాన్ శుక్లా రూపొందించినట్లుగా రాజమౌళి వెల్లడించారు. ఈ 3D యానిమేషన్ టీజరే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ‘బిగ్ సర్ప్రైజ్’ అయి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అద్భుతమైన ట్రీట్‌ను అనుభవించాలంటే థియేటర్లకు వెళ్లక తప్పదు.
