Bill Gates Smriti Irani: స్మృతి ఇరానీ సీరియల్‌లో బిల్‌గేట్స్ గెస్ట్ రోల్..
Bill Gates Smriti Irani: మాజీ కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ హిందీ ధారావాహిక ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ గురించి ఊహించని వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిసిన ఈ సీరియల్‌లో.. ఏకంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్‌గేట్స్ అతిథిగా కనిపించనున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ సమాచారం ప్రకారం బిల్‌గేట్స్ ఈ ధారావాహికలో మూడు ఎపిసోడ్‌ల పాటు ముఖ్య సన్నివేశాల్లో భాగం కానున్నారు. సీరియల్‌లో స్మృతి ఇరానీ పోషిస్తున్న ‘తులసి’ పాత్రతో బిల్‌గేట్స్ వీడియో కాల్‌లో సంభాషించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూడు ఎపిసోడ్‌లలో ప్రధానంగా గర్భిణులు, శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు, వాటిపై అవగాహన కల్పించే అంశాలు చర్చకు రానున్నాయి. తులసి తన సందేహాలను బిల్‌గేట్స్‌తో వీడియో కాల్ ద్వారా నివృత్తి చేసుకుంటుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇలాంటి సామాజిక అవగాహన కల్పించే అంశాలను ప్రోత్సహించడానికి స్మృతి ఇరానీ ఈ ప్రజాదరణ పొందిన సీరియల్‌ను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఈ సీరియల్‌లో నటి సాక్షి తన్వర్, కిరణ్ కర్మాకర్, ఏక్తా కపూర్ వంటి పలువురు సెలబ్రిటీలు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు బిల్‌గేట్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి వ్యక్తి ఇందులో కనిపించబోతున్నారనే వార్త.. ప్రేక్షకుల్లో, ముఖ్యంగా టెక్ ప్రపంచంలో మరియు సీరియల్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. సుమారు 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ ధారావాహిక కూడా అదే స్థాయిలో ప్రజాదరణ పొందుతోంది.
