Meesaala pilla: ‘మీసాల పిల్ల’ రికార్డు.. 13 రోజులుగా టాప్ ట్రెండింగ్‌లోనే..
Meesaala pilla: అగ్ర కథానాయకుడు చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న బహుళ-అంచనాలతో కూడిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గీతం అద్భుతమైన ప్రజాదరణను పొంది, యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది.
విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు ఈ పాట యూట్యూబ్‌లో నిరంతరంగా ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండడం విశేషం. ఏకంగా 13 రోజులుగా యూట్యూబ్ ట్రెండింగ్ చార్ట్‌లో టాప్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని, ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకూ ఈ పాటకు 36 మిలియన్ల వీక్షణలు దక్కాయి. భార్యాభర్తల మధ్య ఉండే అల్లరి, ప్రేమను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ గీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
‘ఎఫ్ 3’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవిని సరికొత్త కోణంలో ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న చిత్రీకరణలో ప్రముఖ నటుడు వెంకటేశ్ కూడా భాగమయ్యారు. చిరంజీవి, వెంకటేశ్‌ల మధ్య కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. షూటింగ్‌లో వెంకటేశ్‌కు స్వాగతం పలుకుతూ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో అభిమానులను ఆకట్టుకుంది. అందులో చిరంజీవి వెంకటేశ్‌ను ‘మై బ్రదర్’ అని ఆప్యాయంగా పిలవగా, వెంకీ మామ బదులిస్తూ ‘చిరు సార్.. మై బాస్’ అంటూ మెగాస్టార్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. ఆమె ఇందులో శశిరేఖ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నయనతార వంటి అగ్ర తారలు ఒకే తెరపై కనిపించబోతుండడం ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
