Chiru Venky: కొండవీటి దొంగతో బొబ్బిలి రాజా: చిరంజీవి, వెంకటేష్‌ల క్లాసిక్ లుక్స్‌తో ఎయిటీస్ రీయూనియన్ సందడి!
Chiru Venky: ప్రతి సంవత్సరం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎయిటీస్ క్లాస్ రీయూనియన్ పార్టీ ఈసారి కూడా మరుపురాని జ్ఞాపకాలను మిగిల్చింది. సౌత్ ఇండియన్ సినిమా స్టార్ హీరోలు, హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా ఒకే వేదికపై చేరి, పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ పార్టీకి ప్రత్యేకంగా నిర్ణయించిన డ్రెస్ కోడ్ ధరించి, తారలందరూ మాస్ లుక్‌లో మెరిసిపోవడం, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది.
అయితే, ఈ ఏడాది రీయూనియన్‌లో విడుదలైన ఒక ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కనిపించిన తీరు అభిమానులను ఫిదా చేసింది.
చిరంజీవి ధరించిన చిరుతపులి ప్రింట్ డిజైనర్ షర్ట్, ఆయన స్టైల్‌తో కలిపి అచ్చం 1990 నాటి తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కొండవీటి దొంగ’ లుక్‌ను గుర్తు చేసింది. సామాజిక బాధ్యతతో కూడిన రాబిన్ హుడ్ తరహా పాత్రలో చిరు ఆ చిత్రంలో నటించి అలరించారు. దానికి తగ్గట్టే ఈసారి కూడా చిరంజీవి తన స్టైల్‌తో మంత్రముగ్ధులను చేశారు.
ఆయన పక్కనే వెంకటేష్ కూడా తన క్లాసిక్ స్టైల్‌లో మెరిశారు. ట్రేడ్‌మార్క్ హ్యాట్ ధరించి, పులి ప్రింట్ టీషర్ట్‌పై కోట్ వేసుకుని, 1990లో వచ్చిన తన హిట్ సినిమా ‘బొబ్బిలి రాజా’ స్టైల్‌ను అనుకరించారు. బొబ్బిలి రాజాలో వెంకీ చిలిపి రాజాగా నటించి మాస్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరు దిగ్గజాలు పాత క్లాసిక్ లుక్‌లలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో, నెటిజన్లు “కొండవీటి దొంగ, బొబ్బిలి రాజా” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ స్పెషల్ ఫ్రేమ్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఈ కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శివశంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని తాజా సమాచారం. త్వరలోనే వెంకీతో సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుందని వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
