Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1.. 3 నిమిషాల సీన్ కోసం.. 4 రోజులు రోజూ గంటన్నర ట్రెక్కింగ్ చేసిన మూవీ టీమ్
Kantara Chapter 1: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘కాంతార: చాప్టర్ 1’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి విజన్, అద్భుతమైన కథనంతో పాటు, ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా టైగర్ సీక్వెన్స్, రథంపై యుద్ధ సన్నివేశాలు, పచ్చని అడవుల్లోని దృశ్యాలు సినిమాకు అసలైన ‘ఫ్రెష్ లుక్’ను తీసుకువచ్చాయి. ఈ విజువల్ మ్యాజిక్ వెనుక కృషి చేసిన సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ తాజాగా సినిమా మేకింగ్ విశేషాలను పంచుకున్నారు.
ఈ సినిమాలోని 95 శాతం చిత్రీకరణ కర్ణాటకలోని కుందాపుర ప్రాంతంలోనే జరిగిందని అరవింద్ తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు చిత్రబృందం అంతా అక్కడే ఉండి షూటింగ్ చేసిందని, ఆ సమయంలో నిద్రలేని రాత్రులు, ఎంతో ఒత్తిడిని అనుభవించామని చెప్పారు. “సవాళ్లు స్వీకరించినప్పుడే అసలైన ప్రతిభ బయటపడుతుంది” అని నమ్మే అరవింద్, రోజువారీ లైటింగ్‌తో ఎన్నో ప్రయోగాలు చేసేవారట. అటవీ ప్రాంతంలో సరైన లైటింగ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి ఒక్కోసారి వారాల సమయం కూడా పట్టేదని, దర్శకుడు అనుకున్నట్లు సీన్ వచ్చే వరకు ఏ విషయంలోనూ రాజీ పడేవారు కాదని ఆయన వివరించారు.
సినిమాలో ప్రేక్షకులు ఆశ్చర్యపోయిన టైగర్ సీక్వెన్స్‌పై కూడా అరవింద్ మాట్లాడారు. ఈ సన్నివేశాలన్నింటినీ షూటింగ్ మొదలుపెట్టిన తొలి సంవత్సరంలోనే పూర్తి చేశారట. ఎందుకంటే, పోస్ట్ ప్రొడక్షన్ (VFX) పనులకు ఎక్కువ సమయం అవసరం. “పులి వీఎఫ్‌ఎక్స్ చేసినట్లు కాకుండా, నిజంగా పులి నడుచుకుంటూ వస్తే వాతావరణం, నీడలు, ఆకులు ఎలా కనపడాలి అనే ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సీన్ తీశాం” అని ఆయన అన్నారు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు.
గులిగా నటించిన రిషబ్‌శెట్టి గురించిన ప్రస్తావన తెస్తూ… “అతడిలో ఉత్సాహం అనంతం. అతను నటిస్తుంటే మొత్తం సెట్ ఆ ఎనర్జీని ఫీలయ్యేది. ముఖ్యంగా గులిగా కనిపించే ఎమోషనల్ సీన్స్‌ను ఒకటి లేదా రెండు టేకుల్లోనే పూర్తి చేయాలి. లేకపోతే ఆ స్థాయి భావోద్వేగాలు మళ్లీ రావడం కష్టం” అని కశ్యప్ పేర్కొన్నారు.
మరోవైపు, యువరాణి కనకవతి గుర్రంపై వచ్చే సన్నివేశం చిత్రీకరణకు చాలా కష్టమైందని అరవింద్ చెప్పారు. ఆ లొకేషన్ అడవిలో చాలా దూరం ఉండడం వల్ల గంటన్నర ప్రయాణం చేసి, ఆ తర్వాత నడుచుకుంటూ, కొండ ఎక్కి దిగాల్సి వచ్చేదట. కేవలం మూడు నిమిషాల నిడివి గల ఆ సీన్ కోసం నాలుగు రోజులు షూట్ చేశారట. వాతావరణ సమస్యలు ఎదురైనా, ప్రొడక్షన్ టీమ్ సహకారంతో మొత్తం 200 రోజులు షూటింగ్ పూర్తి చేశామని అరవింద్ కశ్యప్ వెల్లడించారు.
