Comedian Ali : చిరంజీవి అనుభవమే కమెడియన్ అలీకి కూడా.. వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటుడు, ఏం జరిగిందంటే
టాలీవుడ్ లో సీనియర్ నటుల్లో కమెడియన్ అలీ ఒకరు. అలీ కన్నా వయసులో పెద్దవారు ఉన్నారు కానీ అనుభవం పరంగా అలీ చాలా సీనియర్. సీతాకోక చిలుక చిత్రం టైం నుంచి అలీ చైల్డ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది లెజెండ్స్ తో అలీకి మంచి సంబంధాలు ఉన్నాయి.
అలీ ప్రస్తుతం బుల్లితెరపై అలీతో సరదాగా అనే చాట్ షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శివాజీ అతిథిగా హాజరైన ఎపిసోడ్ లో అలీ కూడా తన అనుభవాలని పంచుకున్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ఇద్దరూ కలసి దాదాపు 25 చిత్రాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శివాజీ.. అలీని అన్నా అంటూ సంభోదించాడు.
అలీ అన్నా నువ్వు చెప్పినట్లే సొంత ఊర్లో కోటిన్నర రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకున్నా. 30 ఎకరాల వరకు పొలం కూడా ఉంది. ఆర్టిస్టుల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. కాబట్టి సొంత ఊర్లో ఇల్లు, ఆస్తులు ఉంటే మంచిది అని నువ్వే అన్నావు అని శివాజీ అలీకి తెలిపాడు.
అలీ స్పందిస్తూ తన అనుభవాన్ని వివరించారు. నేను నీకు చెప్పిన ఈ విషయాన్ని నాకు శోభన్ బాబుగారు చెప్పారు. నాకు కాస్త పాపులారిటీ వచ్చి.. అవకాశాలు పెరుగుతున్న టైంలో డబ్బు బాగా ఖర్చుపెట్టేవాడిని. ఆ టైంలో శోభన్ బాబు గారు పిలిచి సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఆర్టిస్ట్ జీవితం ఎలా ఉంటుందో చెప్పలేం. మనం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
డబ్బు వృధాగా ఖర్చు చేయకు. కాస్ట్లీ కార్లు, ఇతర వస్తువులు కొని వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే పదిమంది నీ చుట్టూ ఉంటారు. డబ్బు లేకపోతే నీ కులానికి చెందిన వాళ్ళు కూడా దగ్గరకి రారు. నీవు ఆకలితో ఉంటే ఎవరూ భోజనం పెట్టరు. డబ్బు వృధా చేయకుండా నల్లబంగారం మీద వెచ్చించు అని చెప్పారట. అలీకి నల్ల బంగారం అంటే ఏంటో అర్థ కాక.. నల్ల బంగారం అంటే ఏంటి సర్ అని బిక్క ముఖంతో అడిగాడట.. దీనికి శోభన్ బాబు సమాధానం ఇస్తూ అదేరా భూమి అని చెప్పారట.
అలీ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవికి కి కూడా ఒక అనుభవం ఎదురైంది. చిరంజీవి ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్న సమయంలో ఎన్టీఆర్ ఒక సలహా ఇచ్చారట. మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు బ్రదర్.. ఇనుప ముక్కల కోసం మీ డబ్బుని వృధా చేసుకోకండి.. స్థలాలు కొనుక్కోండి అని ఎన్టీఆర్ సలహా ఇచ్చిన విషయాన్ని చిరంజీవి ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.