Deepika Padukone: ఆ హీరోలందరూ రోజూ 8 గంటలే పని చేస్తారు.. పేర్లు చెప్పడం ఇష్టం లేదంటూ దీపికా పదుకొణె కామెంట్లు
Deepika Padukone: బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న వర్కింగ్ అవర్స్ విధానంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 8 గంటల పని వేళల కారణంగానే ఆమె పలు భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగారనే వార్తల నేపథ్యంలో, ఈ విషయంపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని నిబంధనలపై ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
“ఆత్మాభిమానం ఉన్న ఒక నటిగా, నన్ను ఇబ్బంది పెట్టే లేదా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పరిస్థితులను నేను ఎప్పటికీ అంగీకరించను,” అని దీపికా స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా అగ్ర కథానాయకులు, సూపర్స్టార్లలో అత్యధికులు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని ఆమె కుండబద్దలు కొట్టారు. “ఇది ఇండస్ట్రీలో రహస్యం కాదు. అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇన్నేళ్లలో ఈ అంశం ఎప్పుడూ ప్రధాన వార్తగా నిలవలేదు. చాలామంది హీరోలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్స్‌లో పాల్గొంటారు. వీకెండ్స్‌లో అసలు పని చేయరు,” అని ఆమె వెల్లడించారు.
అయితే, ఆ హీరోల పేర్లు వెల్లడిస్తే విషయం తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, అందుకే వారి పేర్లు చెప్పదలుచుకోలేదని దీపికా పేర్కొన్నారు. తన న్యాయబద్ధమైన పోరాటం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా అన్న ప్రశ్నకు దీపికా ఘాటుగా సమాధానమిచ్చారు. “ఇలాంటి అనుభవాలను నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను. ఇది నాకు కొత్త కాదు. ఈ పోరాటాలలో చాలావరకు నేను నిశ్శబ్దంగానే యుద్ధం చేశాను. ఎందుకంటే, నిశ్శబ్దంగా ఉండటమే గౌరవంగా, హుందాగా ఉంటుందని నా నమ్మకం,” అని ఆమె తెలిపారు. కొన్ని సందర్భాలలో మాత్రమే కారణాలు బహిరంగం అవుతాయని చెప్పారు.
ఇటీవల దీపికా పదుకొణె నటించాల్సిన రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్లో ఆమె నటించడం లేదంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. అలాగే, ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్లో ప్రకటించిన ‘స్పిరిట్’ సినిమాలో మొదట దీపికానే కథానాయికగా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమె స్థానంలోకి నటి త్రిప్తి డిమ్రీ రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల నుంచి దీపికా తప్పుకోవడానికి ప్రధాన కారణం, ఆమె డిమాండ్ చేస్తున్న 8 గంటల పని విధానమే అయి ఉంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీపికా తాజా వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
