The Bads of Bollywood: బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వివాదం.. రెడ్ చిల్లీస్, నెట్‌ఫ్లిక్స్‌కు దిల్లీ హైకోర్టు సమన్లు
The Bads of Bollywood: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాజీ అధికారి సమీర్ వాంఖడే దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ బృందానికి సమీర్ వాంఖడే నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్… సినీ పరిశ్రమలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఒక యువ హీరో జీవితంలో వచ్చిన మార్పుల చుట్టూ తిరుగుతుంది. అయితే, ఈ సిరీస్‌లో యాంటీ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను, ప్రత్యేకించి ఎన్సీబీ అధికారి పాత్రను అభ్యంతరకరంగా, ప్రతికూలంగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
వాంఖడే తరపు న్యాయవాది వాదిస్తూ, ఈ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్నందున, దీనిని చూసిన తర్వాత వాంఖడేపై, ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య మీమ్స్ (Memes), ట్రోలింగ్ తీవ్రమైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం… ఈ పిటిషన్ వేయడానికి మాజీ ఎన్సీబీ అధికారికి తగిన కారణం ఉందని అభిప్రాయపడింది. అయితే, పిటిషన్‌పై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఒక నిర్దిష్ట న్యాయ ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
ఈ సిరీస్‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి పాత్రను ఇతరులు గుర్తించే విధంగా చూపించడంతో పాటు, పలు చట్టాలను ఉల్లంఘిస్తూ, వాటిని అగౌరవపరిచే విధంగా చిత్రీకరణ జరిగిందని వాంఖడే తమ పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ సిరీస్ ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్ట, పరువుకు భంగం (Defamation) కలిగినందుకు గాను రెడ్ చిల్లీస్, నెట్‌ఫ్లిక్స్‌ల నుంచి రూ.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది.
