Battle Of Galwan: ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’.. సల్మాన్ సినిమాలో అమితాబ్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Battle Of Galwan: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా భాగమయ్యారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు తెరపడింది. ఈ సినిమా దర్శకుడు అపూర్వ అఖియా స్వయంగా ఈ రూమర్స్‌పై స్పందించి స్పష్టతనిచ్చారు. దీంతో రెండు దిగ్గజ నటుల కాంబినేషన్ చూడాలని ఆశించిన అభిమానులు నిరాశకు గురయ్యారు.
అసలు ఈ పుకార్లకు దారి తీసిన సంఘటన ఏమిటంటే… ఇటీవల దర్శకుడు అపూర్వ అఖియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. “బిగ్‌బీ నాకు ఏం చెబుతున్నారో ఎవరైనా ఊహించగలరా?” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను ఆ ఫోటోకు జోడించారు. దీంతో, అమితాబ్ బచ్చన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంలో ముఖ్య పాత్ర లేదా అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీ ప్రియులు, మీడియా వర్గాలు భావించాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై అపూర్వ అఖియా స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. “అమితాబ్ జీ మా సినిమా షూటింగ్ జరిగే స్టూడియోకి ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం వచ్చారు. ఆ సందర్భంగానే నేను ఆయన్ని కలిసి పలకరించాను, ఫోటో దిగాను. అంతే తప్ప ఆయన ఈ సినిమాలో భాగం కావడం లేదు” అని వివరించారు. ఈ ప్రకటనతో, బిగ్ బి ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారనే ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది.
ఈ సినిమా కథాంశం విషయానికొస్తే… ఇది 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణల నేపథ్యంలో రూపొందుతోంది. ఆ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయి, మహావీర చక్ర పురస్కారం అందుకున్న తెలుగు వీరుడు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు సమాచారం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ లడఖ్‌లో కఠినమైన వాతావరణంలో షూటింగ్ పూర్తి చేశారు. చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
