Ari Movie: ‘అరి’ మూవీ ఆధునిక భగవద్గీత: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస!
Ari Movie: ‘పేపర్‌బాయ్’ వంటి విభిన్న కథాంశంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన జయశంకర్, తన రెండో ప్రయత్నంగా ‘అరి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ తాత్విక యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం ఏషియన్ సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు జయశంకర్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
అరిషడ్వర్గాలపై సినిమా… యోగుల సూచనతో స్క్రిప్ట్!
“పురాణాలు, ఇతిహాసాలు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాలను జయించాలని చెప్పాయి. కానీ, ఎలా జయించాలో ఎక్కడా స్పష్టంగా లేదు. మా చిత్రం ‘అరి’ ద్వారా ఆ ఆరు శత్రువులను ఎలా జయించవచ్చో చూపించే ప్రయత్నం చేశాను” అని జయశంకర్ తెలిపారు. ఈ ఆలోచనతోనే 2016లో హిమాలయాలకు వెళ్లినట్లు, అక్కడ కలిసిన కొందరు యోగులు, గురువుల చెప్పిన విషయాల ఆధారంగానే స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ కథ ఆరు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందని, ఇందులో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించారని పేర్కొన్నారు. తాను తెరపై నటుల కంటే పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నానని, అందుకే స్టార్‌డమ్ లేని నటీనటులను ఎంపిక చేసుకున్నానని అన్నారు.
దర్శకుడికి ఉపేంద్ర సినిమాలంటే చాలా ఇష్టమని, ఆయన చిత్రాలు వాణిజ్య అంశాలతో పాటు లోతైన తాత్వికతను ఆవిష్కరించే శైలి తనకు ప్రేరణ అని చెప్పారు. ఈ సినిమాలో వైవా హర్ష పంచే హాస్యం, అలాగే ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన నాణ్యమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా సినిమాకు బలాన్నిస్తుందని చెప్పారు.
ఎం.వెంకయ్యనాయుడు, “ఈ సినిమా ఆధునిక భగవద్గీతలా ఉంది. పురాణాలు చదవని యువతరం ఈ సినిమా చూస్తే చాలు, వాటి సారం తెలుస్తుంది” అని ప్రశంసించడం తనకు లభించిన గొప్ప అభినందన అని జయశంకర్ తెలిపారు. అశ్వనీదత్, రచయితలు మల్లాది వెంకటకృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖులు కూడా సినిమాను మెచ్చుకున్నారని చెప్పారు.
