MTV Music: ఒక శకం ముగిసింది: ప్రపంచవ్యాప్తంగా MTV మ్యూజిక్ ఛానెళ్లు బంద్
MTV Music: ఒకప్పుడు యువతకు వినోదాన్ని పంచడంలో, ట్రెండ్‌లను సెట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన మ్యూజిక్ టెలివిజన్ (MTV) ఇప్పుడు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు లేని రోజుల్లో, స్కూల్, కాలేజీల నుంచి రాగానే యూత్ అంతా తమ అభిమాన పాటల కోసం ఆశగా చూసే ఈ MTV ఛానళ్లు ఇకపై కనుమరుగు కానున్నాయి.
ఎంటీవీ యాజమాన్యం తమ ప్రధాన మ్యూజిక్ ఛానెళ్లను మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ‘MTV 80s’, ‘MTV Music’, ‘Club MTV’, ‘MTV 90s’, ‘MTV Live’ వంటి మ్యూజిక్ ఓరియెంటెడ్ ఛానెళ్లను ప్రపంచవ్యాప్తంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఛానెళ్లు 2024, డిసెంబర్ 31వ తేదీ తర్వాత అందుబాటులో ఉండవని పారామౌంట్ గ్లోబల్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, ఎంటీవీ బ్రాండ్‌లో భాగంగా ప్రసారమయ్యే రియాలిటీ టీవీ షోలు మాత్రం యథావిధిగా వినోదాన్ని అందిస్తూనే ఉంటాయని తెలిపింది.
ప్రస్తుతం వినోదం కోసం స్మార్ట్‌ఫోన్‌లలో ఎన్నో యాప్‌లు, యూట్యూబ్, స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ పోటీని తట్టుకోలేకే ఎంటీవీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఎంటీవీ, పారామౌంట్ గ్లోబల్ మీడియాలో విలీనమైంది. వ్యూస్ తక్కువ ఉన్న ఛానెళ్లను మూసివేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మీడియా దిగ్గజం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మ్యూజిక్ టెలివిజన్ (MTV) 1981లో అమెరికాలో ప్రారంభమైంది. తొలుత మ్యూజిక్ వీడియోలకు ప్రాధాన్యత ఇచ్చినా, ఆ తర్వాత రియాలిటీ షోలు, ఫ్యాషన్ షోలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దశాబ్దాల పాటు ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ మ్యూజిక్ ఛానెళ్లు మూతబడుతుండటంతో, నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో “ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒక శకం ముగిసింది” అంటూ పోస్టులు పెడుతున్నారు.
