Ilaiyaraaja: ‘డ్యూడ్’ చిత్ర బృందానికి ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే?
Ilaiyaraaja: ప్రముఖ సంగీత మాంత్రికుడు ఇళయరాజా మరోసారి కాపీరైట్ ఉల్లంఘన వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలై విజయం సాధించిన తమిళ చిత్రం ‘డ్యూడ్’ మేకర్స్‌పై ఆయన న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన రెండు పాటలను సినిమాలో ఉపయోగించినందుకు గాను చిత్ర బృందానికి ఇళయరాజా కాపీరైట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
‘డ్యూడ్’ చిత్ర నిర్మాతలు తన నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా, పాటలకు సరైన రాయల్టీ చెల్లించకుండా వాటిని సినిమాలో వినియోగించుకున్నారని ఇళయరాజా తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. కళాకారుల హక్కులు, మేధో సంపత్తి విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడకుండా పోరాడుతుంటారు. ఈ నేపథ్యంలో తన పాటల వాడకంపై ఆయన చిత్ర బృందానికి నోటీసులు పంపారు.
ఈ కేసు విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఇళయరాజాకు న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. సంగీత దర్శకుడి హక్కులను పరిరక్షించే విధంగా కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో కాపీరైట్ అంశాల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుంది, ఇళయరాజా డిమాండ్‌లపై ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కాగా గతంలో కూడా ఇళయరాజా తన పాటల హక్కుల విషయంలో పలువురు నిర్మాతలు, సంగీత దర్శకులపై న్యాయపోరాటం చేశారు. ఆయన సొంత పాటలపై పూర్తి కాపీరైట్ తనకే చెందుతుందని, తన అనుమతి లేకుండా వాటిని రీమిక్స్ చేయడానికీ, వేరే సినిమాల్లో ఉపయోగించడానికీ వీలు లేదని ఆయన చాలా సందర్భాల్లో గట్టిగా వాదించారు. ప్రస్తుతం ‘డ్యూడ్’ సినిమాపై వచ్చిన ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
