Ileana DCruz: రెండో బిడ్డ తర్వాత అనేక సమస్యలు.. మానసిక క్షోభ అనుభవించా: ఇలియానా
Ileana DCruz: బాలీవుడ్ నటి ఇలియానా డి క్రూజ్ తన వృత్తి జీవితం కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌కు జన్మనిచ్చిన తర్వాత, ఆమె తాజాగా ‘కీను రాఫే డోలన్’కు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో, తన రెండవ గర్భధారణ, ప్రసవం తర్వాత ఎదురైన అనుభవాలను ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
తన మొదటి గర్భధారణ గురించి మాట్లాడుతూ, “మొదటిసారి తల్లి అయినప్పుడు, నేను ఒంటరి మహిళ నుండి అకస్మాత్తుగా తల్లిగా మారినట్లు అనిపించింది. మానసికంగా ఎంతో గందరగోళానికి గురయ్యాను. కానీ నా దృష్టి అంతా బిడ్డ ఆరోగ్యం, సంరక్షణ పైనే ఉండేది” అని తెలిపారు.
అయితే, రెండో బిడ్డ తర్వాత తన మానసిక స్థితి పూర్తిగా మారిపోయిందని ఇలియానా చెప్పారు. “రెండో బిడ్డ పుట్టాక నేను చాలా గందరగోళంలో పడ్డాను. స్నేహితులు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఇది చాలా కష్టంగా అనిపించింది. ఒంటరిగా ఉండటం ఒక పెద్ద సవాల్ అయింది” అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం విదేశాల్లో తన భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి పిల్లల పెంపకంపై దృష్టి పెట్టినప్పటికీ, ముంబైలో ఉన్న తన స్నేహితుల సపోర్ట్‌ను, మానసిక స్థైర్యం కోసం పొందిన సహాయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు.
వృత్తిపరంగా చూస్తే, ఇలియానా చివరిసారిగా 2024లో విడుదలైన ‘దో ఔర్ దో ప్యార్’ అనే హిందీ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ప్రస్తుతం ఆమె పిల్లల పెంపకానికే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. “పిల్లలు కొంచెం పెద్దవాళ్లయ్యాకే కెరీర్‌పై మళ్లీ దృష్టి పెడతాను” అని ఇలియానా స్పష్టం చేశారు.
2023లో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్న ఇలియానా, ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా పూర్తి స్థాయి ఫ్యామిలీ లైఫ్‌ను ఆనందిస్తున్నారు. ఆమె తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నారని, మాతృత్వంలో దొరికే ఆనందం మరే ఇతర అనుభవంతోనూ పోల్చలేనిదని తెలిపారు.
మనుషుల జీవితంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఇలియానా చేసిన వ్యాఖ్యలు సమాజంలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
