Janasena – Elections : వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళతాం. గతంలోనే ఇవ్వాల్సిన అవకాశాలు, చేయాల్సిన ప్రయోగాలు సమాజంలో మార్పు కోసం చేశాం. ఈ దఫా 2019 మోడల్ అనుసరించను. ఈసారి ఖచ్చితంగా బలమైన వ్యూహంతో రాజకీయం ఉంటుంది. సర్వేలు, రిపోర్టులు ఎప్పటికప్పుడు తెప్పించుకొని దానికి అనుగుణంగానే ముందుకు వెళతాం. జనసేన పార్టీ ఎక్కడ నెంబర్ వన్ స్థానంలో ఉందో అక్కడ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా మన ప్రణాళికలు ఉండాలి.
నెంబర్ 2 స్థానంలో ఉన్న చోట బలంగా పనిచేసి మొదటి స్థానానికి వచ్చేలా ప్రయత్నం చేద్దాం, మూడో స్థానంలో ఉంటే కనుక అందర్ని కలుపుకొని వెళ్లి పార్టీ కోసం కష్టపడాలి. కనీసం అక్కడ పార్టీని రెండో స్థానంలో అయినా తీసుకురావాలి. పదివేల ఓట్లు తెచ్చుకోలేనివారు కూడా నాయకులు అయిపోవాలని భావిస్తున్నారు. నా పక్కన నిలబడితే ఓట్లు పడవు. నా కోసం వచ్చేవారే తప్ప మీ కోసం వచ్చేవారు ఉండరు. ముందు ప్రజల్లో బలంగా పని చేసి కనీసం పదివేల మంది మద్దతు కూడగట్టి తయారు కావాలి.
ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రజల కోసం పని చేస్తున్న నాయకులు కార్యకర్తల కోసం ఖర్చు. పెట్టాల్సిన అవసరం ఉంది. ఓట్లు కొనమని నేను చెప్పను. కానీ ఖచ్చితంగా కార్యకర్తల కోసం ఖర్చు చేయండి. కొత్త నాయకత్వం అనేది ఏ పార్టీకి అయినా అవసరమే. రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉంటుంది. వయసు దాటిపోయాక కూడా నేనే నాయకుడ్ని నాదే అధికారం అనుకుంటే చెల్లదు. 20 ఏళ్ల తర్వాత ఎవరికైనా కొత్త నాయకత్వం విలువ తెలుస్తుంది.
నేను కూడా వృద్ధాప్యంలో రాజకీయాల్లోకి రాలేదు. సరైన సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చానని భావిస్తాను. నాయకులు కూడా నిత్య విద్యార్ధిలా ఉండాలి. అవసరమైన విషయాల పట్ల దృష్టి పెట్టండి. ఎవరో వచ్చి నాయకులను తయారు చేయరు. ప్రజల కోసం పోరాటం చేస్తే వారే మనల్ని నాయకులుగా గుర్తిస్తారు. నీతి, నిజాయతీగా పనిచేసి జనసేన పార్టీ అంటే ప్రజలకు అభయం అని పవన్ కళ్యాణ్ అన్నారు.