Janasena vs Jagananna Colony : నీటి తటాకాలు.. బురద రోడ్లు.. మొండి గోడలు.. పైకి తేలిన పునాదులు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల దుస్థితి ఇది. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇంటి పట్టాలు ఇచ్చి జగన్ సర్కార్ చేసిన మోసాన్ని ప్రపంచానికి తెలియజెప్పె బృహత్తర కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. చినుకు పడితేనే వరదలు వచ్చే జగనన్న కాలనీల స్వరూపాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమాన్ని నిర్వహించింది.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జగనన్న కాలనీలను జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సందర్శించి అక్కడున్న వాస్తవ పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియచెప్పారు.
జగనన్న కాలనీల కోసం సేకరించిన భూమిలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వైసీపీ నేతలు, పేదలకు పట్టాలు పంపిణీ పేరుతో వారిని నిండా ముంచిన వైనాన్ని కళ్లకు కట్టారు. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా వీలు లేని ప్రాంతాల్లో వారు పడుతున్న బాధలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన జనసేన నేతలను సైతం కదిలించాయి.
చాలా చోట్ల లబ్ధిదారులే తమ వెతలను బాధలను చెబుతూ స్వయంగా జగనన్న కాలనీల వద్దకు జనసేన నాయకులను తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలో జగనన్న కాలనీ దుస్థితిని వివరించే ప్రయత్నం చేసిన జనసేన శ్రేణులను పోలీసుల సాయంతో అడ్డుకుని అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు.
జగనన్న కాలనీల మోసాన్ని బట్టబయలు చేసిన డిజిటల్ క్యాంపెయిన్ లో పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులు, వీర మహిళలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతోపాటు మండల కమిటీల సభ్యులు సైతం తమ తమ పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.