Janasena – Ycp : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మనోహర్ గారు విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇసుక దందా అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. జగనన్న కాలనీల్లో పేదలు ఇల్లు కట్టుకునే సమయంలో ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకకు కూడా రకరకాల ఛార్జీల పేరుతో డబ్బు గుంజుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడుసార్లు ఇనుక విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఆ విధానం వల్ల పేదలకు, అలాగే భవన నిర్మాణ కార్మికులకు మేలు జరగాల్సింది పోయి కొత్త కష్టాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వారు చెప్పిన వేదన నన్ను కదిలించింది. కూలి పనులను నమ్ముకున్న భవన నిర్మాణ కార్మికులకు వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే పని ఉంటోంది. ఇప్పటికీ సరిగ్గా ఇసుక దొరక్క వారికి జీవన బృతి కూడా కష్టమవుతోందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
క్షేత్ర స్థాయిలో ఇసుక కొరత చాలా దారుణంగా ఉంది. నిర్వహణ కాంట్రాక్టర్.. కట్టబెట్టిన కంపెనీ కాకుండా క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బహిరంగంగా ఈ దందా సాగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రజలకు ఏ విధానం మేలు చేస్తుంది. వారిని ఎలా ఆదుకోవాలి అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలు ఆశయానికి అనుగుణంగా ఆయన జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.
జన్మదినం కేవలం కేకులు కోసి పండగలా కాకుండా, ఒక అంకితభావంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించుకోవడం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం. ఏ పరిస్థితిలో అయినా ప్రజలకు పార్టీ పరంగా మంచి చేయాలి అన్నది.? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. దానికి అనుగుణంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా కార్యక్రమాలను జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు క్రమశిక్షణతో నిర్వహించారు. ఇదే ఐకమత్యంతో, స్పూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందిస్తుంది’ అన్నారు.