Kaantha Teaser: సినిమా పేరు శాంత కాదు “కాంత”.. టీజర్ వచ్చేసింది!
Kaantha Teaser: దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ స్టార్ కానీ ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్లతో తెలుగునాట విశేషమైన అభిమానులను సంపాదించుకున్న దుల్కర్, ఇప్పుడు ‘కాంత’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘కాంత’ కథేంటంటే..?
‘కాంత’ టీజర్ చూస్తే ఇదొక విభిన్నమైన కథాంశంతో రూపొందించిన పీరియాడిక్ డ్రామా అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా తొలినాళ్ల నాటి వాతావరణాన్ని గుర్తుచేస్తూ, దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఆకట్టుకునేలా ఈ టీజర్‌ను కట్ చేశారు. దుల్కర్ సల్మాన్ ఇందులో 1960ల నాటి ఓ స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నారు. ‘శాంత’ అనే ఓ హారర్ సినిమాను తెరకెక్కించే క్రమంలో జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని టీజర్ చూస్తే తెలుస్తోంది.
సినిమాలో దుల్కర్‌కి గురువుగా, అలాగే దర్శకుడిగా సముద్రఖని నటించారు. కెరీర్ ప్రారంభంలో దుల్కర్, సముద్రఖని మధ్య ఉన్న స్నేహబంధం, ఆ తర్వాత వచ్చే విభేదాలు, ‘శాంత’ సినిమా నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించనున్నారు. దుల్కర్ తన గురువుకు ధీటుగా ఈ సినిమాను ఎలా తీయగలిగాడు, ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలు సినిమాకు కీలకం కానున్నాయి.
ఎవరెవరు నటిస్తున్నారంటే..?
దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలక భూమిక పోషించనుంది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటితో పాటు ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాను చంతార్ సంగీతం అందిస్తున్నారు. గత చిత్రాలైన ‘మహానటి’, ‘సీతారామం’లలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన దుల్కర్, ‘కాంత’లో కూడా తన నటనతో మరోసారి మెప్పించడం ఖాయమని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ‘లక్కీ భాస్కర్’ విజయవంతమైన తర్వాత దుల్కర్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
