Kiran Abbavaram: కొడుకు ఫేస్ రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. బుజ్జి ‘హను’మంతుడిలా..!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, ఆయన సతీమణి, నటి రహస్య గోరక్ దంపతులు తమ నవజాత కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో, ఈ జంట తమ కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదాల చెంతనే తమ బుజ్జాయికి నామకరణం చేయడం విశేషం.
ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి..
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ, “మా అబ్బాయిని మొదటిసారి తిరుమలకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే స్వామివారి ఆశీస్సులతో నామకరణం చేశాం. మా బాబుకు ‘హను అబ్బవరం’ అని పేరు పెట్టాము. ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి,” అని తన సంతోషాన్ని పంచుకున్నారు.

అందుకే ‘హను’ అనే పేరు..
ఈ ఏడాది హనుమాన్ జయంతి (మే 22, 2025) రోజున తమకు కుమారుడు జన్మించాడని, అందుకే ఆ స్వామి గుర్తుగా ‘హను’ అనే పేరు పెట్టినట్లు కిరణ్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి చిత్రాన్ని అభిమానులతో పంచుకుని, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

అబ్బో.. అబ్బవరం..
‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కిరణ్-రహస్య జంట, ప్రేమించి 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం కిరణ్ ‘K-Ramp’, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే మరో కొత్త సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు. తమ అభిమాన నటుడి కుమారుడికి పవిత్రమైన పేరు పెట్టడంపై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
