Su From So: కన్నడలో సూపర్ హిట్ అయిన హార్రర్ కామెడీ.. తెలుగులోనూ వచ్చేస్తోంది..!
Su From So: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే, కన్నడలో ఘన విజయం సాధించిన ‘సు ఫ్రమ్ సో’ చిత్రం తెలుగులో విడుదలకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి. శెట్టి వంటి నటులు కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం ‘సు ఫ్రమ్ సో’. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద రూ. 36 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భారీ విజయం తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే టైటిల్‌తో ‘సు ఫ్రమ్ సో’ ఈ నెల 8వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వచ్చే వారం ‘వార్ 2’, ‘కూలీ’ వంటి పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో, ‘సు ఫ్రమ్ సో’ చిత్రాన్ని ఈ వారమే (ఆగస్టు 8న) థియేటర్లలోకి తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించింది. కన్నడలో ఇప్పటికే అద్భుతమైన ప్రజాదరణ పొందిన ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
‘సు ఫ్రమ్ సో’ ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ హారర్ కామెడీగా తెరకెక్కింది. తీర ప్రాంతంలోని ఒక గ్రామంలో అశోక్ అనే యువకుడు ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. సులోచన అనే దెయ్యం అతన్ని ఆవహించిందనే పుకార్లు గ్రామంలో వ్యాపిస్తాయి. ఆ తర్వాత గ్రామంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. అసలు ఈ సంఘటనలకు కారణం ఏమిటి? సులోచన దెయ్యం నిజంగా ఉందా? చివరకు ఏం జరిగింది? అనే అంశాలు కథను ఉత్కంఠగా కలిగిస్తాయి.
ఈ చిత్రానికి జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో కూడా నటించారు. కథ కూడా ఆయనదే. ప్రముఖ కన్నడ హీరో, దర్శకుడు రాజ్ బి. శెట్టి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కన్నడలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
