Madhuri Dixit: 3 గంటలు ఆలస్యంగా షోకు మాధురీ దీక్షిత్.. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఆగ్రహం
Madhuri Dixit: బాలీవుడ్ అగ్ర నటీమణులలో ఒకరైన మాధురీ దీక్షిత్ కెనడాలో నిర్వహించిన తన లైవ్ మ్యూజికల్ ఈవెంట్‌కు 3 గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లపై ప్రదర్శన ప్రారంభ సమయం రాత్రి 7:30 గంటలుగా పేర్కొనగా, మాధురీ దీక్షిత్ స్టేజిపైకి రాత్రి 10 గంటలు దాటిన తర్వాతే వచ్చారు. దాదాపు మూడు గంటల ఈ ఆలస్యం అభిమానులలో తీవ్ర నిరాశను, కోపాన్ని రేకెత్తించింది.
ఈవెంట్‌కు హాజరైన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్వహణ లోపాలను, తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఒక నెటిజన్ ఈ షో గురించి తీవ్ర విమర్శలు చేస్తూ, “ఇది అత్యంత చెత్త షో. ప్రకటనల్లో చెప్పినట్లుగా కాకుండా, మాధురి గారు కేవలం ఆలస్యంగా రావడమే కాక, చాలా తక్కువ సమయం మాట్లాడారు. అంతేకాక ప్రతి పాటకు ఒకటి రెండు సార్లు మాత్రమే డ్యాన్స్ చేశారు. ఇది చాలా నిరాశపరిచింది” అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో నెటిజన్ తన నిరసనను తెలియజేస్తూ మాధురి రాక ఆలస్యం కావడం వల్ల, తనకు ఇతర పనులు ఉండటం వలన షో మొదలుకాకముందే వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేసినట్లు సమాచారం. ఇంతటి ప్రముఖ నటి ప్రదర్శన కోసం అధిక ధర వెచ్చించి, అంత సమయం వేచి చూసిన అభిమానులకు దక్కింది నిరాశేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ లైవ్ ఈవెంట్ ఆలస్యం, నాణ్యత లేమిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో, ఈవెంట్ నిర్వాహకులు, అలాగే మాధురీ దీక్షిత్ ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడం, నిర్వహణలో లోపాలు ఉండటం వల్ల ఇలాంటి భారీ లైవ్ షోలకు ప్రతికూలత ఎదురైనట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
