Lokah Movie: హాలీవుడ్ మ్యాగజైన్‌పై ‘కొత్త లోక’ టీమ్.. ఆ రేంజ్ హిట్ మరి
Lokah Movie: మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలో సంచలన విజయం సాధించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (తెలుగులో కొత్త లోక) చిత్రం అంతర్జాతీయంగా మరో మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా బృందం తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ కవర్‌స్టోరీగా నిలిచి, మలయాళ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ప్రసిద్ధ హాలీవుడ్ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ తమ భారతీయ ఎడిషన్ అయిన ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ కవర్‌పై ‘లోక’ చిత్రానికి చోటు కల్పించింది.
అక్టోబర్ నెల సంచిక కోసం ఈ మ్యాగజైన్ ‘లోక చాప్టర్ 1 చంద్ర’ చిత్రాన్ని ప్రత్యేకంగా కవర్ చేసింది. ఇందులో చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్, లీడ్ రోల్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్, దర్శకుడు డామినిక్ అరుణ్‌లు బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ఈ కవర్‌పై ‘సూపర్ హిట్’ అనే పేరుతో ఈ కథనాన్ని ప్రచురించారు.
ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం, ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్‌పై కవర్‌స్టోరీగా నిలవడం మలయాళ చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప గౌరవం. ఇది కేవలం చిత్ర బృందం కృషికి మాత్రమే కాకుండా, మలయాళ చిత్రాల నిర్మాణ ప్రమాణాలు, కథాంశాల నాణ్యతకు లభించిన గుర్తింపు అని చెప్పవచ్చు. ఈ ఘనతతో మలయాళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టిని ఆకర్షించనున్నాయి. అక్టోబర్ నెలలో ఈ ప్రత్యేక సంచిక విడుదల కానుంది.
కాగా.. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు సినిమాలు రాబోతున్నాయని సమాచారం. తొలి భాగంలో కల్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్‌లో నటించగా, నెస్లన్, చందు, సాయికుమార్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా, హీరో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చాప్టర్ 2 లో భారీ మార్పులు
తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రకారం, ‘లోక చాప్టర్ 2’లో కథానాయిక స్థానంలో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు పూర్తి నిడివి పాత్రల్లో కనిపించనుండటం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ ‘వే ఫేరర్ ఫిల్మ్స్’ నిర్మించిన ఈ తొలి భాగానికి డొమెనిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ‘చాప్టర్ 2’కి కూడా ఆయనే దర్శకత్వం వహించబోతున్నారు.
