Missing Cases of Women : విశాఖలో నిర్వహించినటువంటి జనవాణి జనసేన భరోసా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళల యువతల అదృశ్యం గురించి నమ్మలేని నిజాలను బహిర్గతం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో దాదాపు 30వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమైపోయారని నేను చెబితే వైసీపీ నాయకులు నన్ను విమర్శించారు. అయితే నేను మాట్లాడింది నిజమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి గారు చెప్పారు.
ఇప్పుడు దానికి ఉదాహరణగా అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన నడిగట్ల శ్రీనివాసరావు దంపతులు తమ 16 ఏళ్ల కుమార్తె రెండేళ్ల క్రితం కిడ్నాప్ అయిందని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పోలీసులు ఫోన్ కాల్స్ ట్రాప్ చేశారు. కిడ్నాప్ కు ఉపయోగించిన కారును ఇచ్చాపురంలో గుర్తించారు. కిడ్నాప్ చేసింది గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు అని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇన్ని తెలిసినా ఆ మైనర్ బాలికను ఎందుకు గుర్తించలేకపోయారు? పోలీసులకు ఫోన్ చేసి చేతులు కట్టేస్తోంది ఎవరు? అదృశ్యమైన మహిళల్లో అందరూ తిరిగి వచ్చేశారని వైసీపీ నాయకులు, పోలీసులు చెబుతున్నారు. నిజంగా తిరిగి వచ్చేస్తే శ్రీనివాసరావు దంపతులు ఈ రోజు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే అందులో 65 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే, అదృశ్యమైన ఆడపిల్ల రెండు రోజులు దాటితే ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారో తెలియడం లేదు.
పోలీస్ వ్యవస్థగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు సరికదా తల్లిదండ్రులను హైకోర్టులో వేసిన రిట్ పిటీషన్ ఉపసంహరించుకోమని బెదిరించడం ఏంటి? కనీసం స్పందించని ఈ వ్యవస్థపై ఆ తల్లిదండ్రులకు ఆవేశం రాక ఏమొస్తుంది..? న్యాయ పోరాటం కూడా చేయొద్దని ఆ తల్లిదండ్రులను బెదిరిస్తున్న వారిపై రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.