Mohan Babu on Rajinikanth: రజనీకాంత్ అలా చెప్పడంతోనే.. మోహన్ బాబు ఇలా కోపాన్ని తగ్గించుకున్నారట!
Mohan Babu on Rajinikanth: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన నటనా ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. ఈ మధ్యే విడుదలైన “కన్నప్ప” చిత్రంలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో కొన్ని నిమిషాలే కనిపించినప్పటికీ, ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారని విమర్శకులు ప్రశంసించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించి, గత సినిమాలతో పోలిస్తే సానుకూల స్పందనను అందుకుంది.

ఐదు దశాబ్దాలకు పైగా స్నేహం..
తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు తన బెస్ట్ ఫ్రెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా వీరి స్నేహం కొనసాగుతోందని, చెన్నై ప్లాట్‌ఫామ్‌పై నటులుగా పరిచయం కాకముందే కలుసుకున్నామని తెలిపారు. తాను రజనీకాంత్‌ను ముద్దుగా “హేమ్ బ్లడీ తలైవా” అని పిలుస్తానని చెప్పారు.

పుస్తకాల సారాంశాన్ని జీవితానికి అన్వయించుకోవాలి..!
ఈ ఇంటర్వ్యూలో రజనీకాంత్ తనకు కోపాన్ని తగ్గించుకోవడానికి ఇచ్చిన సలహాను గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. “పుస్తకాలు చదవడమే కాదు, వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని, జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడే కోపాన్ని వదులుకోగలవు” అని రజనీకాంత్ చెప్పిన మాటలు తనలో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని మోహన్ బాబు వెల్లడించారు. గతంలో ఆయన కోపం గురించి వార్తలు వచ్చినా, ఈ మధ్య కాలంలో అలాంటి ఫిర్యాదులు లేకపోవడం గమనార్హం.
