Nadendla Manohar in Guntur : గుంటూరు లాలుపురం జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొని,మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేస్తే దిక్కులేదు… ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న డేటాకే రక్షణ లేకపోతే, సామాన్యుడి కుటుంబాల డేటాకి భద్రత ఎక్కడ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం ప్రజల డేటా చోరీ చేస్తోందన్నారు. ప్రజల వివరాలు తెలుసుకుని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థకు ఇచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి రోడ్డు వేయాలో కూడా ఆ సంస్ధ నిర్ణయిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నొక్కే బటన్లతో ఈ ముఖ్యమంత్రి ఎవరి జీవితాలు బాగు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. మాట్లాడితే 360 డిగ్రీస్ డేటా ఫైలింగ్ అని చెబుతున్నారు.
గతంలో ప్రభుత్వాలు ఫించన్లు ఇవ్వలేదా? పథకాలు ప్రజలకు అందలేదా? ఏ నాయకుడి దగ్గరకు వెళ్లి చెప్పుకున్నా లబ్దిదారులకు పథకాలు అందేవి. ఇప్పుడు ఈ డేటా మొత్తం సేకరించి ఎవరి చేతుల్లోనో పెడుతున్నారు. మాట్లాడితే పేటీఎం బ్యాచ్ తో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. మీరు ఏం చేసినా జనసేన పార్టీ సామాన్యుడి కోసం స్పందిస్తూనే ఉంటుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. జనసేన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట ఇవ్వదు.
ఇచ్చాక పార్టీ ఆ మాటకు కట్టుబడి నిలబడుతుంది. ఈ రోజు ఉదయం మల్లవల్లి రైతులకు ఇచ్చిన మాట కోసం వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ అద్భుతంగా నిలబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది అని నాదెండ్ల వెల్లడించారు.