Nadendla Manohar – Mangalagiri : మంగళగిరిలోని వీర మహిళ విభాగం సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. అయితే మన సిద్ధాంతాలు, భావజాలం జాతీయ స్థాయిలో దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణ కోసం ఉంటాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగమూర్తుల ఆత్మబలిదానాలు, పోరాటాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, ఆ త్యాగ ఫలాలను కొంతమంది స్వార్ధపరులు దుర్వినియోగం
చేస్తున్నారని, ప్రజల హక్కులను కాలరాస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచి, 77వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఎంతోమంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేస్తే మనకు ఈ స్వాతంత్ర్యం వచ్చింది. వారి స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లాం. ఇలాంటి పండుగ రోజు సోదరీమణులైన వీర మహిళలతో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఏ పార్టీకి లేని మహిళా శక్తి జనసేన పార్టీకి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారు చిన్న పిలుపు ఇస్తే చాలు పార్టీ తరపున జెండా పట్టుకొని ముందుగా నిలబడేది వీర మహిళలే. జన సైనికుడిగా గర్వపడుతున్నా , జనసేన పార్టీ స్థాపించి దశాబ్ద కాలం అయ్యింది. ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు తనవంతు పోరాటం చేశారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేయాలనుకునే వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు.
అలాంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఒక తెలుగువాడిగా, జన సైనికుడిగా ఆయనతోపాటు కలసి పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. కొంతమంది పాలకులు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం దేశం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వ్యక్తులను నిత్యం స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు అని నాదెండ్ల పేర్కొన్నారు.