Nadendla Manohar : సీబీఐ విచారణకు వెళ్లాల్సిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా సిబ్బందిపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడటం అప్రజాస్వామికం. ఈ దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, హెచ్ఎం టీవీలకు సంబంధించిన విలేకరులను, ఇతర సిబ్బందిని గాయపరచి, వాహనాలను, కెమెరాలను ధ్వంసం చేయడం చూస్తుంటే వైసీపీ గూండాల బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది అని ఆయన వైసీపీ ప్రభుత్వం పైన మండి పడ్డారు. హైదరాబాద్ నగరంలో నడి రోడ్డుపై కడప ఎంపీ సంబంధీకుల వీరంగాన్ని తెలంగాణా ప్రజలు కళ్లారా చూశారు.
మీడియాపై చేసిన దాడి వైసీపీలో నెలకొన్న ఆందోళననను, అసహనాన్ని సూచిస్తోంది. ఈ దాడికి పాల్పడినవారిపైనా, పురిగొల్పిన వారిపైన కేసులు నమోదు చేసి వారిపైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను కోరుతున్నాను అనీ నాదెండ్ల తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కూడా మీడియాకు రంగులు పూసి మాట్లాడుతున్నారు.
బాబాయి హత్య కేసుకు సంబంధించి. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వైసీపీకి కంటగింపుగా మారాయి. అందుకే ఈ క్రమంలో భౌతిక దాడులకు తెగబడుతున్నారు అని నాదెండ్ల ప్రభుత్వ విధానంపై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఈనాడు, ఈటీవీ యాజమాన్యంపై మార్గదర్శి పేరుతో వేధింపులకు పాల్పడుతోంది.
వైసీపీ ప్రభుత్వం దాడులు, వేధింపులతో మీడియాను కట్టడి చేయాలని చూడటం ప్రమాదకరం. ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యలను ఖండించాలి లేదంటే ఈలాంటి ప్రభుత్వం వల్ల ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ముప్పు అనీ నాదెండ్ల అన్నారు.