Nadendla Manohar : ఒంగోలులో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ..హెలీకాప్టర్లో తప్ప రోడ్డు మీద తిరగలేని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులను మళ్లించి దివాళా తీయించింది అన్నారు. సొంత డబ్బు ఖర్చు చేసిన అధికార పార్టీ సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి ఆర్ధిక ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకుందనీ ఇదా మీ పరిపాలన.? అంటూ ఆయన ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు.
అకాల వర్షాలకు రైతులు నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టపోతే, ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఇప్పటి వరకు నిర్మించలేని ప్రభుత్వం, ప్రకాశం జిల్లాను అంధకారంలోకి నెట్టేసిందనీ ఆయన ప్రభుత్వ అసమర్థ పాలనను దుయ్యబట్టారు.
జనసేన పార్టీ అవకాశవాద, స్వార్ధ రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉంటుందని తెలిపారు. అధికారంలోకి రాక ముందు ఒకలా.. వచ్చాక మరోలా భాష మార్చి మాట్లాడదనీ ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ ఆవుల వెంకట ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి, రూ. 5 లక్షల చెక్కు అందచేశారు.
“జనసేన పార్టీ మండల స్థాయి, పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మొన్నటి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్గనిర్దేశం చేశారు. పార్టీపరంగా భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజలకు అండగా నిలబడే విధంగా ముందుకు వెళ్తుంది అని తెలియజెప్పారు.
వర్తమాన రాజకీయాల్లో రైతులకి అండగా నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 73 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాంటి నాయకుడి మీద విమర్శలు చేయడం, టీవీ డిబేట్లలో మాట్లాడడం మినహా మంత్రులు ఏం చేస్తున్నారు అనీ ఆయన వైసీపీ నేతలపై మండి పడ్డారు.
ప్రకాశం జిల్లా నుంచి యువత ఎందుకు వలసలు పోతున్నారు. మైనింగ్ పరిశ్రమ రెండేళ్లపాటు ఎందుకు మూతపడింది. ఇప్పుడు వారితో వాటాలు ఒప్పందాలు చేసుకుని తిరిగి కొనసాగిస్తున్నారు. కక్షపూరిత చర్యలతో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో కొంత మందికే పరిమితం అవుతున్నారు.
ఆరోగ్య శ్రీలో ఆసుపత్రులకు వెయ్యి కోట్ల బకాయి పడ్డారు. మొన్న రూ. 100 కోట్లు ఇచ్చారు అని ఆయన అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా సమస్యలపై బలంగా గళం వినిపించే విధంగా ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పారదర్శకంగా, ప్రజల ముందు చర్చించి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయి అని ఆయన వెల్లడించారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారితో చర్చించారు. సీట్లు, ఓట్ల గురించి కాకుండా కేవలం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఆ చర్చలు సాగాయి. పొత్తుల విషయంలో అంతా పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తామన్నారు.