Nagababu : ఎన్.ఆర్.ఐ. వీర మహిళలకు పార్టీలో సముచితమైన గౌరవం ఉంటుంది అని నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా దుబాయ్ దేశం అజ్మాన్ నగరంలోని దుబాయ్ – యూఏఈ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో వీర మహిళలతో నాగబాబు గారు ముఖాముఖి మాట్లాడారు.
ఆ సమావేశాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం వీర మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, జనసేనలో మహిళలకు ఎప్పటికీ గౌరవ ప్రదమైన హోదా ఉంటుందని, ప్రత్యేకంగా ఎన్.అర్.ఐ. వీర మహిళలకు పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వీర మహిళలకు ప్రథమ స్థానం, ప్రాధాన్యత కల్పిస్తూ ఉంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక, సామాజిక అంశాలకు సంబంధించి వీరమహిళలు వ్యక్తం చేసిన ప్రశ్నలకు, సందేహాలకు నాగబాబు గారు చాలా కూలంకుశంగా వివరణ ఇచ్చారు.
ఆ తరువాత ఆస్ట్రేలియా ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీర మహిళల సమన్వయకర్త కొలికొండ శశిధర్ జనసేన బలోపేతం కోసం ఎన్.ఆర్.ఐ. వీర మహిళల పాత్ర అనే అంశంపై మాట్లాడారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, కేసరి త్రిమూర్తులు, చందక రామదాసు, కంచన శ్రీకాంత్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.