The Paradise: ‘ది ప్యారడైజ్’.. నాని ‘జడల్’ చూస్తే హడలే.. క్యారెక్టర్ నేమ్ ఏంటో తెలుసా?
The Paradise: ‘దసరా’ లాంటి భారీ విజయం తర్వాత కథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న తదుపరి చిత్రం గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే, వారి కొత్త సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే పేరు ఖరారు చేయగా, తాజాగా ఈ సినిమాలోని నాని పాత్ర పేరును, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాని సరికొత్త మేకోవర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
జడలు వేసుకుని రగ్గుడ్ లుక్‌లో నాని
‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పోస్టర్‌లో రెండు పొడవాటి జడలు వేసుకుని రగ్గుడ్ లుక్ లో నాని అదరగొట్టాడు. పోస్టర్ చూస్తుంటేనే హడల్ పుట్టించేలా ఉన్నాడు నాని. నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంట్ స్టార్ గా మారిపోయాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో ఒక ఇంటర్వ్యూలో నాని లుక్ వెనుక ఒక భావోద్వేగమైన కథ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. తన చిన్నతనంలో తల్లి తనకు అలాగే జడలు వేసేదని, ఆ జ్ఞాపకం కథకు ఎలా ముడిపడి ఉందో త్వరలో తెలుస్తుందని అన్నారు.
వచ్చే ఏడాది మార్చి 26న విడుదల
సికింద్రాబాద్ నేపథ్యంలో సాగె కథనంతో ఈ సినిమా రాబోతుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోందట. శ్రీకాంత్ ఓదెల రెండవగా వస్తున్న ది ప్యారడైజ్ తో నేచురల్ స్టార్ నానిని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో చూపిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
‘ది ప్యారడైజ్’ సినిమాలో తిరుగుబాటు, నాయకత్వం, తల్లీకొడుకుల అనుబంధం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని టీజర్, పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ సహా మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ‘దసరా’ రికార్డులను తిరగరాస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
