Sujeeth Nani: ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్‌తో నాని మూవీ.. గెస్ట్‌గా వెంకీ మామ
Sujeeth Nani: ‘ఓజీ’ (OG) సంచలనం తర్వాత దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను హీరో నానితో కలిసి మొదలుపెట్టారు. గత కొంతకాలంగా ఈ సినిమాపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. కాగా వాటన్నిటికీ తెరదించుతూ దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్ హాజరు కావడం, ఆయన నాని-సుజీత్ టీమ్‌తో కలిసి నవ్వుతూ కనిపించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. దీంతో, ఈ సినిమాలో వెంకటేశ్ కూడా నటిస్తున్నారా? అంటూ నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
‘ఓజీ’ విడుదల కాకముందే ఈ సినిమా ప్రకటన వచ్చినా, ఏడాదికి పైగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ‘ఓజీ’ ప్రమోషన్స్‌లోనే దర్శకుడు సుజీత్ ఈ రూమర్లకు చెక్ పెట్టారు. నానితో సినిమా ఖచ్చితంగా ఉంటుందని అప్పట్లోనే స్పష్టం చేశారు.
నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని, మరిన్ని అప్‌డేట్స్ త్వరలో అందిస్తామని తెలిపారు. సుజీత్ ప్రస్తుతం ‘ఓజీ’ విజయాన్ని ఆస్వాదిస్తుండగా, నాని ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు.
నాని-సుజీత్ కాంబో మూవీ ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగమవుతుందా అనే ప్రశ్నకు సుజీత్ ఇటీవలే సమాధానమిచ్చారు. ఈ చిత్రం తన తొలి సినిమా ‘రన్ రాజా రన్’ తరహాలో రొమాంటిక్-యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టైల్‌లో ఉంటుందని, ‘ఓజీ’ యూనివర్స్‌కు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
