Annapoorani: వివాదాల ‘అన్నపూరణి’ సినిమా రీ-ఎంట్రీ.. ఓటీటీలోకి కొత్త వెర్షన్!
Annapoorani: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూరణి’ సినిమా మరోసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ వచ్చిన వివాదాల కారణంగా గతంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమా తొలగించారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత, ఇప్పుడు ఈ సినిమా కొత్త వెర్షన్‌తో రీ-ఎంట్రీ ఇస్తోంది.
వివాదాస్పద సన్నివేశాల తొలగింపు
గతంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీవ్ర వివాదాలకు కారణమయ్యాయి. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి మాంసాహారాన్ని వండుతూ కనిపించడం, మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పెద్ద దుమారం రేగడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను తొలగించింది. ఆ తర్వాత, నయనతార కూడా క్షమాపణలు చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించి, రన్‌టైమ్‌ను 10 నిమిషాలు తగ్గించారు. రెండు గంటల 15 నిమిషాల నిడివితో ఈ చిత్రం జియో సినిమా, జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ప్రస్తుతానికి ఈ సినిమా హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాను నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించగా, ఇది ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం. జియో స్టూడియోస్, నాడ్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్లే, అచ్యుత్ కుమార్, కుమారి సచు, రేణుక, కార్తీక్ కుమార్, సురేష్ చక్రవర్తి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందించారు. ఇంతకాలం తర్వాత వివాదాల నుంచి బయటపడి మళ్లీ ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
