NTR Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ నుంచి అప్డేట్.. ట్యునీషియాలో భారీ యాక్షన్ షెడ్యూల్
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ను ఏ విధంగా చూపిస్తారనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. తాజాగా, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికొచ్చింది.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం విదేశాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియాలో లొకేషన్ల రెక్కీ కోసం ఈ వారం అంతా పర్యటించనున్నారు. లొకేషన్లు ఫైనల్ అయిన వెంటనే ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో అక్కడే ఓ కీలకమైన భారీ యాక్షన్ షెడ్యూల్‌ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విదేశీ షెడ్యూల్‌కు ముందు హైదరాబాద్‌లో ఒక చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యం కావడం వలన ఎన్టీఆర్ అభిమానులకు ఈ చిత్రం మరింత స్పెషల్ కానుంది. ఈ శక్తిమంతమైన పాత్ర కోసం తారక్ ఇప్పటికే కఠినమైన కసరత్తులు చేసి సన్నని లుక్‌లోకి మారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ ఫిలిమ్స్ సమర్పిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ హై-వోల్టేజ్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
