One Nation One Election : “వన్ నేషన్ వన్ ఎలక్షన్” అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచనను జనసేన పార్టీ మనస్పూర్తిగా స్వాగతిస్తూ, మద్దతు తెలుపుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీ వేయడం శుభ పరిణామం అన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారు జమిలి ఎన్నికల గురించి మాట్లాడారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘రాజ్యాంగ దినోత్సవం అయిన నవంబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తూ దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామని, దీనిపై ప్రజలు కూడా చర్చించాలని పేర్కొన్నారు.
అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు. స్వాతంత్య్రానంతరం 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో దేశమంతటికీ ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తరువాత రాజకీయ పరిణామాల క్రమంలో ఈ సంప్రదాయం కొనసాగించలేకపోయారు. దీనివల్ల దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరగడం నిత్యకృత్యంగా మారిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపైనే ప్రభుత్వాలు, పాలకులు దృష్టి నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగంలాంటి అంశాలతోపాటు ఆర్ధిక అభివృద్ధి, విద్యావ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాలపై దృష్టి నిలిపేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రజల దృష్టి ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల మీదనే ఉండిపోవడంతో ప్రజా ఉన్నతికి సంబంధించిన అంశాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడానికి ఇదో కారణంగా నిలిచింది. దేశమంతటా ఒకసారి ఎన్నికలు జరిగితే ప్రజల చర్చ పూర్తిగా దేశాభివృద్ధి గురించే జరుగుతుంది.
దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన కేంద్ర భద్రతా బలగాలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఎన్నికల విధుల్లోనే ఉండిపోతున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా భద్రతా బలగాలకు విలువైన సమయం ఆదా కావడంతో పాటు దేశ భద్రతపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుంది. వలస కార్మికులు ప్రతీసారి ఎన్నికలు జరుగుతుంటే ఎన్నో ఇబ్బందులుపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే అంతరాష్ట్ర వలస కార్మికులకు ఇబ్బందులు తప్పుతాయి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.