పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సుద్దగడ్డ కాల్వ వెనుక నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ దాదాపు 2500 కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు అని అంచనా. ఇప్పటికే 500 కుటుంబాల వరకూ ఇక్కడ నివాసం ఉంటున్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అయితే వర్షం వచ్చిన ప్రతిసారీ ఈ స్థలాలు అన్నీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు నాయకులకూ ఈ సమస్యపై పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోని పరిస్థితి. వర్షం వచ్చిందంటే దారి మునిగిపోయి అక్కడ రాకపోకలకు దారి లేని పరిస్థితి.
ఇలా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి మేం 2500 కుటుంబాలకు పక్కా ఇండ్లకు స్థలాలు ఇచ్చాం అని డబ్బా కొట్టుకోవడం ఏంటి అని అధికార వైస్సార్సీపీ ని ప్రజలు నిలదీస్తున్నారు..
చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలని సరిగ్గా నెరవేర్చాలని ఇలా తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకోవడం తగదు అని తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాయకులు రావడం పేపర్లలో పేర్లు వేయించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణం సుద్దగడ్డ కాల్వ ఆధునీకరణ చేసి, కాల్వపై వంతెన నిర్మించి తమ సమస్యను తీర్చాలి అని వేడుకుంటున్నారు.
