Pawan Kalyan – Aditya L-1 : ఇండియా గర్వించే విధంగా ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకున్నటువంటి ఆలోచన విధానం మనకు తెలిసిందే. చంద్రయాన్ 3 ద్వారా వారు చంద్రుడిపై అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకునే దిశగా ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఆ ప్రయోగంతో భారతదేశానికి ఒక ప్రయోగాత్మక చరిత్రను ఇస్రో శాస్త్రవేత్తలు సృష్టించారు.
ఇప్పుడు అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేసి ఆదిత్య ఎల్ -1 అబ్సర్వేటరీని మరోసారి విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్రో శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ లాండర్ ను దించి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా చంద్రునిపై అనేక పరీక్షలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న మన ఇస్రో శాస్త్రవేత్తలు మరో గొప్ప ప్రయోగానికి విజయవంతంగా శ్రీకారం చుట్టడం హర్షణీయం.
సూర్యునిపై అధ్యయనం జరపడానికి నిర్దేశించిన ఆదిత్య ఎల్ -1 అబ్సర్వేటరీని నేడు విజయవంతంగా ప్రయోగింగించిన సందర్భంగా శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. అంతరిక్ష రంగాన భారతదేశాన్ని నిలపడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎంత కొనియాడినా తక్కువే. శాస్త్రీయ విజ్ఞాన ఫలాలు మానవ కల్యాణానికి
ఉపయోగపడే దిశగా కృషి చేస్తున్న కేంద్రంలోని బి.జె.పి.ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని వెల్లడించారు. ఆదిత్య ఎల్ -1 ప్రయోగం నిర్దేశిత ప్రయోజనాన్ని సాధించడంలో సఫలీకృతం అవుతుందని నమ్ముతున్నాను. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.