Pawan Kalyan – Anakapalli : వారాహి విజయ యాత్రలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేటలో వైసీపీ నేతలచే ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించేందుకు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అగనంపూడి టోల్ గేట్ నుంచి జన సైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అగనంపూడి, మారేడుపూడి, గొల్లవానిపాలెం, అనకాపల్లి బైపాస్, కొత్తూరు,
కశింకోట తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టారు. ప్రతి గ్రామం నుంచి జనసైనికులు, ప్రజలు ద్విచక్ర వాహనాల్లో పవన్ కళ్యాణ్ గారిని అనుసరించారు. వాహన శ్రేణి వెనుక సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. జనసేన ర్యాలీతో 5వ నంబర్ జాతీయ రహదారి మొత్తం జనంతో కిక్కిరిసింది. అగనంపూడి నుంచి బయ్యారం వరకు హైవే మొత్తం జనసేన జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. ఆడపడుచులు హారతులు పట్టి దిష్టితీయగా, పూల వర్షంతో ముంచెత్తారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు.
బయ్యారం, విస్సన్నపేట గ్రామాల ప్రజలు ప్రతి ఇంటి ముందు హారతులతో పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించారు. అక్కడి నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి భూ ఆక్రమణలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సగం కొండను తవ్వేసి వేసిన రోడ్డుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కొండపైన నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ని మీడియా వాహనంపై నుంచి రాష్ట్ర ప్రజలకు చూపించారు. అక్రమ భూ ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించిన మనోహర్ గారు.
పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు విస్సన్నపేట భూ ఆక్రమణ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. అక్రమ తవ్వకాలు, కొండ మీద నిర్మించిన గెస్ట్ హౌస్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. వందల ఎకరాలు దురాక్రమణకు గురైన వైనాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 45 ఎకరాల చెరువుని పూడ్చారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేసింది.