Pawan Kalyan – Birthday : శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాల్లో భాగంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద భవన కార్మికులకు ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో మనోహర్ గారు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి బటన్లు నొక్కి కార్యక్రమం మానుకుని భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు సూచించారు. వారానికి రెండు మూడు రోజులు మంచి పనులు దొరక్కపోవడంతో ఆ కష్ట జీవులు పడి ఇబ్బందులను పాలకులు అర్ధం చేసుకోవాలన్నారు. పని కల్పించడమే ప్రభుత్వం నుంచి వారు కోరుకునే మార్పుని తెలిపారు.
జనసేన ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను కాపాడుకునే విధంగా అన్ని విధాలా భరోసా కల్పిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రోజు పని కల్పించే విధంగా మార్పులు తీసుకువస్తామన్నారు. వారితో కలసి అల్పాహారం స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తున్నాయి.
ప్రభుత్వ తప్పుడు విధానాల మూలంగా క్షేత్ర స్థాయిలో నష్టపోయిన రంగాలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అంటే కేవలం కేక్ కటింగులకు పరిమితం కాకుండా ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలనీ అధినేత తపనను మా పార్టీ నాయకులంతా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా భవన నిర్మాణ -కార్మికులకు ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ ముఖ్యమంత్రి వచ్చి నాలుగున్న రేళ్లు అయ్యింది. ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికులకు వారానికి రెండు రోజుల మించి పని కల్పించలేకపోయారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వింటుంటే బాధ కలుగుతోంది. జనసేన పార్టీ వారికి ఎప్పుడూ అండగా నిలుస్తూనే వచ్చింది. ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో వారికి అండగా పవన్ కళ్యాణ్ గారు విశాఖలో అద్భుతమైన లాంగ్ మార్చ్ నిర్వహించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాం. అప్పట్లో ఆకలి బాధలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఐదు రోజులు పాటు వరుసగా శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదానం నిర్వహించాం. ఆపత్కాలంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండి, తోడ్పాటును ఇచ్చింది జనసేన పార్టీ అని ఆయన పేర్కొన్నారు.