Pawan Kalyan – Divyangulu : విశాఖ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దివ్యాంగులలో పరిమితమైన ప్రతిభ ఉంటుంది. వారి సామర్ధ్యానికి తగ్గట్టు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ‘2016 దివ్యాంగుల చట్టం’ సక్రమంగా అమలు చేయడంతోపాటు దివ్యాంగుల పట్ల చులకనగా మాట్లాడినా, అపహాస్యం చేసినా శిక్షపడేలా కొత్త చట్టాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
జనసేన ప్రభుత్వంలో దివ్యాంగులను గుండెల్లో పెట్టి చూసుకుంటామని, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే దుస్థితిని దూరం చేస్తామని అన్నారు. గురువారం విశాఖపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులు తన అవస్థలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. దివ్యాంగులు దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉంటారు. వారిలో అపరిమితమైన ప్రతిభ ఉన్నా ఎందుకో వారంటే సమాజంలో చిన్నచూపు. ప్రభుత్వాలు కూడా వారిపై వివక్ష చూపిస్తాయి.
అంగ వైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికేట్ ఇవ్వరు, సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇవ్వరు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో దివ్యాంగులు ఉంటే కేవలం 4 లక్షల మందికే ఈ ప్రభుత్వం పెన్షన్ రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. దివ్యాంగులలో ఉన్నత చదువులు చదువుకున్న వారు, క్రీడాకారులు ఉన్నారు. వారి సామర్థ్యానికి తగ్గట్టు ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి అని అన్నారు. దివ్యాంగులు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా వివక్ష అనుభవిస్తున్నారు.
సమాజంలో వారిపట్ల చులకన భావం ఉంది, ఆ భావన పోగొట్టి, సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత జనసేన తీసుకుంటుంది. విదేశాల్లో దివ్యాంగులను గొప్పగా చూస్తారు, వాళ్లను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు జరుగుతాయి. బస్సుల్లో ప్రత్యేక సీట్లు, ఎక్కిందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి రిజర్వేషన్లు మన రాష్ట్రంలోని కల్పిస్తాం. దివ్యాంగుల్లో ఆత్మనూన్యత భావం పోగొట్టేందుకు వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు దివ్యాంగుల
క్రికెట్ టీమ్ కు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాను. అంగ వైకల్యంతో పుట్టిన పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు రోడ్డు పక్కన వదిలేస్తే చాలా ఆర్గనైజేషన్లు వారిని తెచ్చి పెంచుతున్నారు. అలాంటి ఆర్గనైజేషన్లకు జనసేన ప్రభుత్వంలో అండగా ఉంటాం. అప్పు చేసైనా వాళ్లను పోషిస్తాం.. ఉన్నచోటి సంపాదించుకునేలా తోడ్పాటు అందిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.