Pawan Kalyan – Gajuwaka : సముద్రం జనంగా మారి పుర వీధుల్ని ముంచెత్తిందా ? గాజువాక ప్రజానీకం మొత్తం రోడ్ల మీదకు వచ్చేసిందా అన్న చందంగా సిందయా నుంచి పాత గాజువాక వరకు రహదారులు, భవంతులు మొత్తం జనంతో నిండిపోయాయి. వారాహి విజయయాత్ర సభకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గాజువాక ప్రజలు ప్రతి అడుగులో అపూర్వ స్వాగతం పలికారు.
జనసైన్యపు సునామీ పురవీధుల్ని ముంచెత్తింది. జయ, జయధ్వానాల మధ్య జనసేనాని వారాహి రథాన్ని అధిరోహించి విజయవాదం చేశారు. సింధియా ప్రాంతం నుంచి పాత గాజువాక వరకు.. ఏడు కిలోమీటర్ల మేర సాగిన మహా ర్యాలీ ప్రతి అడుగూ కనువిందుగా సాగింది. గాజువాక వారాహీ విజయయాత్ర సభ కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 5 గంటలకు నోవాటెల్ నుంచి గాజువాకకు బయలుదేరారు. అప్పటికి నోవాటెల్ హోటల్ వద్దకు వేలాదిగా చేరుకున్న జనసేన శ్రేణులు, ప్రజలు పెద్ద పెట్టున జయజయ ద్వానాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఎదురొచ్చారు.
వారాహి విజయయాత్ర సందర్భంగా విశాఖ నగరంలో పోలీసులు ఆంక్షలు యధావిధిగా కొనసాగిస్తూ సిరిపురం జంక్షన్, ద్వారకానగర్ ఫ్లై ఓవర్, రైల్వే స్టేషన్, పోర్టు రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణిని ముందుకు తీసుకు వెళ్లారు. పోర్టు రోడ్డు నుంచి పిందియా ప్రాంతానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. జన సైనికుల నినాదాలు, ఆడపడుచుల హారతులు, పూల వర్షంలో తడిసి ముద్దవుతూ ముందుకు సాగారు.
సింధియా నుంచి ప్రతి అడుగు జనప్రభంజనంగా వారాహి విజయ యాత్ర ర్యాలీ సాగింది. సింధియా, మల్కాపురం, శ్రీవారిపురం, కొత్త గాజువాక ప్రధాన రహదారి మొత్తం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. ఏడు కిలోమీటర్ల ర్యాలీ మూడు గంటల పాటు సాగడం వారాహి విజయ యాత్రకు గాజువాక ప్రజల నుంచి వచ్చిన మద్దతుకు అద్దం పడుతుంది.వారాహి విజయ యాత్రకు స్వాగతం పలికేందుకు జనసేన శ్రేణులతోపాటు ప్రజలు కూడా స్వచ్చందంగా సంప్రదాయ వాద్యాలు, హల్లో ఏపీ.. బైబై వైసీపీ.. హల్లో ఏపీ.. వెల్కమ్ జేఎస్సీ.. నినాదాలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ గారి రాకకు సూచకంగా ప్రతి అడుగులో అశేష జన వాహిని ఘన స్వాగతం పలికారు.