Pawan Kalyan – Janasena Bharosa : విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉత్తరాంధ్రలోని అన్నీ జిల్లాల నుంచి జనం రెండోపతండాలుగా వచ్చారు. అందరి సమస్యలను సావధానంగా పవన్ కళ్యాణ్ విన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో దుర్వినియోగం అవుతోంది. ఎస్సీలకు రక్షణగా నిలవాల్సిన చట్టాన్ని వైసీపీ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోంది.
తమకు అడ్డువచ్చే వారిపై తమ అక్రమాలను ప్రశ్నించేవారిపై చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా తమను ప్రశ్నించిన ఎస్పీలపైనే వైసీపీ నేతలు తప్పుడు కేసులుపెడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్సీ వర్గాలకు చెందిన యువతను అన్యాయంగా వాడుకొని, బీసీలపై కేసులు పెట్టిస్తున్నారు. ఎస్సీ, బీసీల మధ్య ఐక్యతను విచ్చిన్నం చేసి వైసీపీ పబ్బం గడుపుకుంటోంది అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
ఈ సందర్భంగా దువ్వాడ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు అనే రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన 84 సెంట్ల స్థలాన్ని స్థానికంగా ఉండే దేవల వెంటకరమణ కబ్జా చేసిన వైనాన్ని, అడిగితే కొందరు ఎస్సీ యువకులను ఇంటి మీదకు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసును పెడతానని బెదిరిస్తున్న వైనాన్ని పవన్ కళ్యాణ్ గారి ముందుంచారు. శ్రీనివాసరావుకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నా, ఆక్సిజన్ మాస్కుతో వచ్చి పవన్ కళ్యాణ్ గారికి తన వేదన చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా సమస్యను విన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీలు నిజంగా అన్యాయానికి గురైనపుడు చట్టం వల్ల న్యాయం జరగడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపింకి గ్రామంలో బోదకాలు వ్యాధి ప్రబలితే పైనున్న ఎస్సీ కుటుంబాల వారు వదిలే వాడుక నీరు కిందకు రాకుండా కిందనున్న వారు అడ్డుకొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అలాంటి వారికి అండగా నిలబడాలి. చట్టాన్ని వైసీపీ కేవలం రాజకీయంగా కాళ్ల తీర్చుకోవడానికి, ఇబ్బందిపెట్టడానికి వాడుకుంటోంది.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా బెదిరింపులకు, వేధింపులకు అస్త్రం కాకూడదు. తప్పుడు కేసులు పెట్టమని దళిత యువకులకు రాజకీయ పార్టీల నాయకులు చెబితే దాన్ని యువత నిలదీయండి. మా రక్షణ కోసం ఉన్న చట్టాన్ని అనైతికంగా ఉపయోగించి ఎందుకు కేసులుపెట్టాలని ప్రశ్నించండి. దీనిపై దళిత మేధావులు, అధికారులు, యువత కూడా మేధో మధనం చేయాలి. చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు మీద స్పందించాలి.
తప్పు జరిగితే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు చట్టం ప్రకారం న్యాయం జరగాలి. అంతేకాని చట్టం అడ్డు పెట్టుకొని దురాగతాలు జరగకూడదు. అద్భుతమైన చట్టం దుర్వినియోగం చేస్తాం.. దీన్ని ఇతరులను వేధించడానికి అన్యాయంగా వాడుకుంటాం అని వైసీపీ భావిస్తే దాన్ని ఖచ్చితంగా జనసేన వ్యతిరేకిస్తుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.