Pawan Kalyan – Janavani : ఎటు చూసినా దోపిడీలు ,దౌర్జన్యాలు, దాష్టీకాలు, కబ్జాలు, అధికార పార్టీ నాయకుల అరాచకాలు, ప్రతి సమస్య వెనకా కంటికి కనిపించని దోపిడీ, ప్రతి కాగితం వెనకా కన్నీటి గాధలు, ప్రతి ఆర్జీ వెనుకా బయటికి చెప్పుకోలేని అలజడులు, మా ప్రభుత్వం అద్భుతాలు చేస్తోందని జబ్బలు చరుచుకుంటూ చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల సొమ్మును తమ పార్టీ నేతలకు ఎలా దోచిపెడుతుందో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ విధమైన అరాచకాలకు పాల్పడుతుందో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో కళ్లకు కట్టాయి.
సునామీలా వెల్లువెత్తిన అర్జీలు పేరుకుపోయిన సమస్యల చిట్టాకు తార్కాణంగా నిలిచాయి. గురువారం విశాఖ ప్రజల సమస్యలు తెలుసుకుని, అర్జీలు స్వీకరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి వినతులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం, నేతల దాష్టీకాలకు బలైన బాధితులు, అధికార పార్టీ భూ బకాసురుల కాటుకు విలవిలలాడిన సామాన్యులు, పింక్షన్ ఎందుకు పోయిందో కూడా తెలుసుకోలేని దివ్యాంగులు, కాలుష్యపు కోరల్లో
కొట్టుమిట్టాడుతున్న నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఎన్టీ పాలిమర్స్ బాధితులు పవన్ కళ్యాణ్ గారి చెంతకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యల అర్జీలు వస్తూనే ఉన్నాయి. ఏడున్నర గంటల పాటు నిర్వరామంగా, నిలువు కాళ్లపై వచ్చిన ప్రతి ఆర్జీని స్వయంగా స్వీకరించారు. 340కి పైగా అర్జీలు పవన్ కళ్యాణ్ గారి చెంతకు వచ్చాయి. కోకొల్లలుగా వస్తున్న సమస్యలు తెలుసుకునేందుకు మరో రెండు మూడు రోజుల పాటు విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించినా పూర్తికావని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రతి సమస్యను ఓపిగా విన్న ఆయన అందరికీ జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్న ధైర్యాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఓ సారి తొంగిచూస్తే… మా భూములు ఎవరికో అమ్మేశాం అంటున్నారు: రాజుపేట, దాకమర్రి రైతులు భీమిలి నియోజకవర్గం, భీమిలి మండలం, దాకమర్రి గ్రామాల రైతులం మేము. వందల ఏళ్లుగా మేము రైతులుగా ఉన్నాము. రేవడి రాజుల నుంచి మా తాతలు ఆ భూములు కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి.
ఇప్పుడు ఎమ్మెల్యే అవంతి. శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు దాట్ల పెదబాబు మీ భూములు రూ.14 కోట్లకు అమ్మేశాను అంటున్నాడు. 450 ఎకరాలు, 600 కుటుంబాలు, 5 పంచాయితీల ప్రజలు ఈ భూముల మీద బతుకుతున్నాం. కోర్టుకు వెళ్లినా ఫలితం లేదు. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పని చేయనివ్వడం లేదు. మా సమస్యకు పరిష్కారం చూపితే వందల కుటుంబాల గుండెల్లో మీరు నిలిచిపోతారు అని బాధితులు వెల్లడించారు.