Pawan Kalyan – Janavani : ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రూ. 5 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందచేశారు. గురువారం విశాఖలో జరిగిన జనవాణి కార్యక్రమానికి ముందు ఇటీవల మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించారు. పాలకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీ రెడ్డి గోవింద్, అనకాపల్లి నియోకవర్గానికి చెందిన బొబ్బరి అప్పలనాయుడు, యలమంచిలి
నియోజకవర్గానికి చెందిన గంధం గోపి, కంఠంరెడ్డి శ్రీను, పాయకరావు పేట నియోజకవర్గానికి చెందిన సమ్మేంగి శ్రీనుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గారు చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ వివరాలు తెలుసుకొని జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుడికి రూ. 50 వేల ఆర్ధిక సాయం వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో
లక్ష్మణరావు అనే పారిశుద్ధ్య కార్మికుడు జీవీఎంసీ 37వ డివిజన్ లో చెత్త సేకరించే సందర్భంగా వారాహి యాత్ర గురించి ప్రచారం చేశాడు. ఈ అంశాన్ని సాకుగా చూపి జీవీఎంసీ అధికారి లక్ష్మణరావును విధులు నుంచి తొలగించారు. విషయం తెలుసుకున్న పవన కళ్యాణ్ గారు విశాఖ జనవాణి కార్యక్రమంలో లక్ష్మణరావుకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు. మరో ఉద్యోగం ఇప్పిస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.