Pawan Kalyan – Panchayati Raj : గ్రామ సర్పంచుల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన నిధులను ప్రభుత్వం కనీసం ఆయా పంచాయతీలకు చెప్పకుండానే. దారి మళ్లిస్తోంది. అసలు పంచాయతీ ఖాతాలకు ఎన్ని నిధులు వచ్చాయో, దేని కోసం ఇచ్చారో, వచ్చిన విధుల్లో ఏ మేరకు మళ్ళించారో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రామీణ దోపిడీ కాక మరి ఏమంటారు..? దీనిని బహిరంగ ప్రజా దోపిడీగానే భావించాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్న మౌలిక సూత్రాన్ని వైసీపీ పూర్తిగా కాలరాస్తోంది. గ్రామీణ వ్యవస్థను క్రమక్రమంగా నిర్వీర్యం చేసి కుట్ర జరుగుతోంది. గతంలోనూ ప్రభుత్వాలు గ్రామీణ వ్యవస్థలను పూర్తిగా పక్కనపెట్టి ఆలోచనలు చేసిన వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇది పూర్తి తారాస్థాయికి చేరింది.
చిన్నప్పుడు పాఠాల్లో గ్రామాలు వాటి అభివృద్ధి నిధులు మీద చదువుకున్న మొత్తం సారాంశం ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో విభిన్నంగా అనిపిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతో గ్రామ సభలు నిర్వహణ లేదు. గ్రామాల్లో కనీస అభివృద్ధికి నిధులు లేవు. మౌలిక సదుపాయాల ఊసే లేదు. గ్రామీణ వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. గ్రామ సభలు జరపడం కూడా రాజకీయ ఒత్తిళ్ళతో మాయమైంది.
గ్రామ సభలు జరపకపోతే సర్పంచుల అధికారం పోయే అవకాశం ఉన్నప్పటికీ చాలాచోట్ల వాటిని పటిష్టంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఒక గ్రామానికి ఏం కావాలి.. ? ఎలాంటి అభివృద్ధి జరగాలి…. వచ్చిన నిధులు ఖర్చులపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన గ్రామసభలు సంవత్సరానికి రెండుసార్లు జరగడం లేదు. గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యలను ప్రభుత్వం పక్కన పెట్టిస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు కేటాయింపులు జరగడం లేదు.
అవి పంచాయతీలకు అందడం లేదు. ఇలా అయితే గ్రామ స్వరాజ్యం ఎలా సాధ్యమవుతుంది. గ్రామ అభివృద్ధి సమగ్ర స్వరూపం మీద ఖచ్చితంగా జనసేన దృష్టి పెడుతుంది అన్నారు. కేరళ పంచాయతీ విధానం ప్రత్యేకం. పంచాయతీలను బలోపేతం చేసే విషయంలో కేరళ ప్రభుత్వం ఉత్తమంగా నిలుస్తోంది. గతంలోనూ కేరళ మంత్రి ఒకరు కేరళలోని స్థానిక సంస్థలు, పంచాయతీల పనితీరును చూడాలని ఆహ్వానించారు. అక్కడున్న పరిస్థితులను మీరు గమనిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.