Pawan Kalyan – Red Clay Dunes : ఎర్రమట్టి దిబ్బల ఆక్రమణలను పరిశీలించిన అనంతరం మీడియాతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వారసత్వంగా వచ్చిన ప్రకృతి సంపదను రక్షించాలని, దాన్ని భావి తరాలకు భద్రంగా అందించాలని ఈ వైసీపీ నాయకులకు లేదు. కనిపించిన మేరకు ప్రకృతి వనరులను దోచుకోవడం, దాని నుంచి వచ్చే సొమ్ములను దాచుకోవడం మాత్రమే తెలుసు. గతంలోనూ ఈ వైసీపీ ముఠా తెలంగాణలో సహజ సిద్ధమైన శిలా సంపదను దోచుకుంది.
కర్నూలు విమానాశ్రయం పక్కనున్న విలువైన సహజ సంపదను దోచేశారు. కంటికి కనిపించిన ప్రతి సంపదను కొల్లగొట్టడం వైసీపీ నైజంగా మారిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. భీమిలి నియోజకవర్గంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం చేస్తున్న వైనాన్ని పవన్ కళ్యాణ్ గారు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.
ఎర్ర మట్టి దిబ్బలను పరిశీలించిన అనంతరం అక్కడే మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. సుమారు 20 వేల సంవత్సరాల క్రితం ఎంతో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైతం దేశ వారసత్వ సంపదగా గుర్తించింది. 262 ఎకరాలను వారసత్వ సంపదగా గుర్తించి దీనిని కాపాడుకోవాలని సూచించింది. దక్షిణాసియాలో కేవలం తమిళనాడు, శ్రీలంక తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఈ వారసత్వ సంపద ఉంది. ప్రకృతి ప్రసాదితంగా దీనిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంతటి కీలకమైన వారసత్వ సంపదను ఆనుకొని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి, ఎర్ర మట్టి దిబ్బల స్వరూపాన్ని మార్చేయాలని చూడడం దుర్మార్గం. చుట్టూ ఉన్న ఎన్నో చెట్లను సైతం నరికేశారు. ఆస్తులను రక్షించాల్సిన వీఎంఆర్డీఏ సైతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేసేలా ఇక్కడ ప్రాంతాన్ని చదును చేయడం సరికాదు. ఉత్తరాంధ్రను పూర్తి స్థాయిలో దోపిడీ చేయడం, ఇక్కడున్న అద్భుతమైన సహజ సంపదను కాజేయడానికి వైసీపీ పన్నాగం పన్నింది అన్నారు.