Pawan Kalyan – Sarpanch : ప్రస్తుతం రాష్ట్రంలో సర్పంచులకు కనీసం రోడ్లు, డ్రైనేజిలు, తాగునీరు అందించేందుకు కూడా నిధులు లేక దేహి అనాల్సిన పరిస్థితి వచ్చింది. చేసిన పనులకు కూడా బిల్లు రాని పరిస్థితి ఉంది. సమస్యలు చెప్పుకొందాం అంటే సర్పంచులకు ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడే కాదు ప్రథమ బాధ్యత తీసుకునే వ్యక్తి. గ్రామానికి పెద్దదిక్కు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 90% అధికారి పార్టీకి ఎప్పుడు చెందుతాయి.
వారు కూడా చాలామంది ఎందుకు గెలిచాం అన్నట్లు ఇంటి లోపలికి వెళ్లి ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి. నిధులు రావు… విధులు లేవు… గౌరవం లేదు అన్నట్లుగా సర్పంచుల పరిస్థితి తయారయింది. కేంద్రం నుంచి వచ్చే ఆర్ధిక సంఘం నిధులు ప్రత్యక్షంగా పంచాయతీల ఖాతాలకు జమ కావాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పంచాయతీల వద్ద యూనియన్ బ్యాంక్ ఖాతాలు తెరిపించింది. దీనిని అనుసరించి పంచాయతీలకు కేంద్రమే ప్రత్యక్షంగా నిధులు అందించేలా ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్తాం.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ నిధుల మీద పెత్తనాన్ని తగ్గించేలా చూడాలని కోరుతాం. సర్పంచులకు 29 అధికారాలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ నిధుల దుర్వినియోగం మీద ఢిల్లీ స్థాయిలో పక్కా రిపోర్టు ఉంది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలు నాతో ఇదే చెబుతారు. వివిధ పథకాలకు వేస్తున్న నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని చెబుతున్నారు. పంచాయతీ సర్పంచులకు పంచాయతీ ఖాతాలో ప్రత్యక్షంగా నిధులు రావాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రానికి వచ్చిన ఒక్క రూపాయి అయినా తన కనుసైగలోని వినియోగం జరగాలని వైసీపీ భావిస్తోంది. అందుకే పంచాయతీలకు వచ్చే నిధులు మీద పెత్తనం సాగిస్తోంది. పంచాయతీలకు వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఎందుకు..? గ్రామాలు అభివృద్ధికి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పక్కదారి పట్టిస్తూ దోపిడీ చేస్తోంది. గ్రామ సభల ముఖ్య ఉద్దేశాన్ని పక్కనపెట్టి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న విషయం మీద పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. రాజకీయాలకు అతీతంగా దీనిపై అందరూ ఐక్యం కావాలి.
జనసేన ప్రభుత్వంలో కేరళ తరహాలో స్థానిక సంస్థలను ఎలా బలోపేతం చేశారో అలా ఖచ్చితంగా చేసేందుకు ప్రయత్నం చేస్తాం. చెక్ పవర్ అనేది సర్పంచులకు తప్ప మరెవరికి లేదు. అంతటి విశిష్ట అధికారాన్ని నిర్వీర్యం చేసేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు గర్హనీయం. అధికారం చూడని కులాలకు స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అనేవి కీలకం. సర్పంచులకు గతంలో ఎంతో గౌరవం ఉండేది ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడానికి వైసీపీ ప్రభుత్వ తీరే కారణం. ఖచ్చితంగా చెక్ పవర్ ఉన్న సర్పంచుల ఖాతాల్లోకి డబ్బులు రావాలి అని పవన్ తెలిపారు.