Pawan Kalyan – Siripuram : సిరిపురంలో వివాదాస్పద సిబిసిఎన్సీ భూములను పర్యవేక్షించిన పవన్ కళ్యాణ్ తర్వాత క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. భూకబ్జాలు చేస్తూ అడ్డగోలుగా భూములను దోచేస్తున్నారు. రాజకీయ చైతన్యం, పోరాట చైతన్యం కలిగిన ఉత్తరాంధ్ర ప్రజలు ఈ దాష్టీకాల మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ సాధనలో ఉస్మానియా విద్యార్ధులు ఎంతగా తెగించి కొట్లాడారో…ఉత్తరాంధ్రలో జరుగుతున్న పాలకుల దోపిడీ మీద ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్ధులు చైతన్యవంతులై పోరాడాల్సిన అవసరం ఉంది.
చట్టబద్ధంగా రావాల్సిన టీడీఆర్ బాండ్లను అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. 2041 లో రావాల్సిన బాండ్లను ఇప్పుడే తెచ్చుకొని వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయి. తణుకులో బయటపడిన టీడీఆర్ బాండ్ల తరహా అక్రమాలు అన్ని చోట్ల ఉన్నాయి. కబ్జా చేసిన స్థలానికి వీధిపోటు అని వీఐపీ రోడ్డుని మూసేశారు.
సిరిపురం జంక్షన్ లో వివాదాస్పద సీబీసీఎన్సీ భూములను అన్యాయంగా అక్రమించడమే కాకుండా ఆ భూములు వీధి పోటు పేరుతో కీలకమైన వీఐపీ రహదారిని సైతం మూసేశారు. చేసేదే తప్పు అయితే మళ్లీ దానికి వీధి పోటు అని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు కల్పించారు. మీరు చేస్తున్న తప్పులకు ఏ పోటు, ఏ వాస్తు మిమ్మల్ని ఆపలేదు. మీ అక్రమాలకు ఏ వాస్తూ సహకరించదు. ప్రజల ఆస్తులను రక్షించడానికి జనసేన ప్రజల తరపున నిత్యం పోరాడుతుంది.
◆ విశాఖపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది.
దేశానికి రక్షణపరంగా విశాఖ అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం మీద కేంద్ర పెద్దలకు ప్రత్యేక సమాచారం ఉంది. నేరాలు, భూ కబ్జాలు, దోపిడీ అన్ని విషయాల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వద్ద పూర్తి సమాచారం ఉంది. ఖచ్చితంగా విశాఖను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి స్థానిక ప్రజల్లో చైతన్యంతో పాటు యువత పాలకుల దాష్టీకాలకు ఎదురు తిరగాలి.తుఫాన్ల నుంచి రక్షణ ఇచ్చే రుషికొండను పూర్తిగా కొల్లగొట్టిన తీరు మనకు కనిపిస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాకా విశాఖలో రోజుకో కబ్జా బయటపడుతూనే ఉంది.
ఇక్కడ జరుగుతున్న విషయాలను జనసేన పార్టీ సైతం బాధ్యతగా కేంద్రానికి తెలియజేస్తుంది” అన్నారు. క్రైస్తవ ఆస్తుల కబ్జా, రోడ్డు మూసివేతను పరిశీలన సందర్భంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. స్థలాన్ని లోపలికి వెళ్ళి చూడరాదని చెప్పడంతో – సాంఘిక సంక్షేమ శాఖకి చెందిన స్థలం వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఈ స్థలాన్ని సైతం కబ్జా చేస్తే జనసేన పోరాటంతో వెనక్కి తగ్గారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన అక్రమాలను, చర్చి ఆస్తులపై టీడీఆర్ తీసుకున్న తీరునీ జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్, ఇతర నాయకులు వివరించారు.