Pawan Kalyan – Steel Plant : ప్రజలు నెత్తిన పెట్టుకున్న వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో నోరు ఎత్తరు. కనీసం మాట్లాడరు. చివరకు నన్ను మాట్లాడమని సలహా ఇస్తారు. నేను ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన సమస్య కోసం ఎవరినైనా కలిసి మాట్లాడతాను. అవసరం అయితే ప్రాధేయపడతాను. చివరికి అదీ కాకుంటే కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని అయినా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా నా శక్తి మేరకు కృషి చేస్తాను. జగన్ తన కేసుల కోసం, తన పనుల కోసం, కుటుంబసభ్యుల కోసం, కాంట్రాక్టుల కోసం కాళ్లు పట్టుకుంటారే తప్ప…
జనం సమస్య మీద కాదు, నేను జనం కోసం పని చేస్తాను. వారికి సమస్య వస్తే దేనికైనా సిద్ధంగా ఉంటాను. 2019లో సైతం నేను ఎంతగానే అభిమానించే నరేంద్ర మోదీ గారినే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విభేధించిన వాడిని. అలాగే అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా పాలసీలను వ్యతిరేకించి బయటకు వచ్చిన వాడిని. నాకు ప్రజలే మొదటి ప్రాధాన్యం. వారి సమస్యలే మొదటి అంజెండా. కేంద్ర పెద్దలు సైతం ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు చెబితే కూలంకషంగా వింటారు.
ప్రధానమంత్రి గారు కానీ, హోంమత్రి గారు, ఇతర పెద్దలు సైతం ప్రజల సమస్యలపై మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తారు. వ్యక్తిగత, స్వలాభం సమస్యల మీద మాట్లాడితేనే వారు దగ్గరకు రానివ్వరు. వైసీపీ నాయకుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రజల సమస్యల మీద మాట్లాడితే కదా… అక్కడున్న వారికి తెలుస్తుంది. ఎప్పుడైనా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడారా? ఏ ఒక్క రోజు ప్రజా సమస్యల మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద పల్లెత్తు మాట మాట్లాడని రాష్ట్ర ఎంపీలు అంటే ఢిల్లీ వర్గాల్లో ఓ రకమైన భావన ఉంది.
ఎంపీలంతా వ్యాపారులు, పైరవీకారులే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరని ఢిల్లీ పెద్దలు భావిస్తారు. ప్రజా పాలసీలు, విధానాలు మన ఎంపీలకు పట్టవని అనుకుంటారు. తమిళనాడులోని సేలం ఉక్కు పరిశ్రమను రక్షించుకోవడానికి తమిళనాడులో రాజకీయ పంజాలన్నీ ఏకమై జరిపిన పోరాటం విజయం సాధించింది. ఒడిశా ప్రజాప్రతినిధుల ఐక్యతతో అక్కడికి నిధులు సాధించుకుంటున్నారు. మన ఎంపీలు మాత్రం కనీసం ప్రజలకు అవసరం అయిన సమస్య మీద కూడా మాట్లాడిన పాపన పోవడం లేదు.
సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంటు కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ప్రైవేటు స్టీలు కంపెనీలకే ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తుంటే, లక్షలాది మందికి దారి చూపే విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు కేటాయించరో మన ఎంపీలు ఒక్కసారి కూడా అడగలేదు. అసమర్ధులు, అవినీతి పరులు చట్టసభల్లోకి వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అని పవన్ వెల్లడించారు.