Pawan Kalyan – Wissannapet : అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేట ఆక్రమణ భూములను పరిశీలించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..జగన్ కు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ, దోమ ఏమీ లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న విలువైన సహజ వనరులను దోచుకోవడం, ప్రకృతి వనరులను కబ్జా చేయడం మాత్రమే జగన్ లక్ష్యం. దాని కోసమే జగన్, అతని మంత్రులు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కడ కొండ కనిపించినా, ప్రభుత్వ భూమి కనిపించినా దాన్ని ఆక్రమించి దోచుకోవడానికి వైసీపీ నాయకుడు సిద్ధంగా ఉంటాడు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేటలో కొండల మధ్య కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన 660 ఎకరాల భూములను సోమవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. కొండపై నిర్మించిన సైట్ ఆఫీస్, అక్కడే నిర్మించిన హెలిపాడ్ గురించి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.
సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల స్వరూపాన్ని వైసీపీ నాయకులు పూర్తిగా మార్చేస్తున్నారు. బయ్యారం రెవిన్యూ గ్రామంలో సర్వే నంబర్ 195/2 లో ఉన్న కీలకమైన పోరంబోకు, దళితుల భూములు, కొండ భూములను అన్యాయంగా ఆక్రమించారు. కొండల నుంచి జాలువారే వర్షపు నీరు క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం మూసివేశారు. సమీపంలోని రంగబోలు రిజర్వాయర్లోకి వెళ్లే గెడ్డలు, కాలువలు, వాగులు అన్నీ మూసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు.
ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ చేపట్టబోయే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ విలువ రూ.13 వేల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద దోపిడీ కోసం ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.