Pawan Kalyan with J P Nadda : పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి ముఖ్య నేతలతో సమావేశం అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. మొదట ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత బిజెపి ముఖ్య నేతలతో సమావేశం అయి, ప్రధాన అంశాల గురించి చర్చిస్తూ రాబోయే రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా గారితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు.
గురువారం ఉదయం ఢిల్లీలో నడ్డా గారి నివాసంలో విస్తృత చర్చలు సాగాయి. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు గురించి ఈ భేటీలో మాట్లాడుకున్నారు అని తెలుస్తుంది. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఒకవైపు బిజెపి అధినేతలతో భేటి కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారని వార్తలు ముందుగానే చక్కర్లు కొట్టాయి. ఎన్డీయే సమావేశానికే వెళ్లానని పవన్ చెప్పినప్పటికీ, ఆ తర్వాత మొదట అమిత్ షా తో ఆ తర్వాత ఇప్పుడు జేపీ నడ్డాతో పవన్ సమావేశపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ ఢిల్లీ వెళ్లినప్పటినుండే వైసీపీ నేతలలో ఒకలాంటి ఆందోళన మొదలైనప్పటికీ, ఎన్డీయే సమావేశానికి పవన్ కళ్యాణ్ పరిమితమవుతాడు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బిజెపి అధినేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం ఆంధ్రప్రదేశ్ లోని అధికార
పక్షానికి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ వరుస బేటీలతో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ, ఇంకా కొత్త ఆలోచనలతో కొత్త పని విధానంతో ముందుకు వెళ్తాడేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగే ఉంటుందని ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ముఖ్య నేతల తో సమావేశమైనారని కొందరి విశ్లేషణ.