Pawan Visit to Delhi : పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం విధితమే.. ఢిల్లీ పర్యటన గురించి పవన్ మాట్లాడుతూ.. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అద్భుతంగా సాగింది. పెద్దలు అమిత్ షా గారితో సమావేశం చక్కగా సాగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, పూర్తిస్థాయిలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించాం. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం బలమైన నిర్ణయం త్వరలోనే ఉంటుంది. దీనిపై ఓ స్పష్టమైన విధాన నిర్ణయం వస్తుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా మేలు చేసేలా ఉంటుంది.
ప్రతిసారి నేను డిల్లీ వెళ్లేటప్పుడు నాకు అపాయింట్ మెంట్ రాలేదని, ఎవరూ కలవలేదని చెప్పినా నేను పెద్దగా పట్టించుకోను. నాకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి ఉన్న భావజాల సంబంధం రాజకీయాలకు అతీతమైంది. 140 కోట్ల మంది భారతీయుల బాగుకోసం నిరంతరం ఆలోచించాల్సిన ప్రధానమంత్రి గారు అవసరం అయితే నన్ను పిలిపించుకొని మాట్లాడతారు. ఆయనకు ఆ హక్కు, స్వేచ్చ ఉన్నాయి. అంతేగాని ప్రతి విషయాన్ని నేను ప్రధానమంత్రి వద్దకు వెళ్లి ప్రస్తావించి, ఆయన విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించేలా చేయాలని అనుకోను.
నాకు బీజేపీ జాతీయ నాయకులతోనూ, ప్రధాని మోదీ గారితో ఉన్న సంత్సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి, వారికి పవన్ కళ్యాణ్ దేనికోసం ఆలోచిస్తాడనేది తెలుసు. నా ఆలోచన ఎప్పుడూ రాష్ట్రం, దేశం కోసం ఉంటుందని వారికి నమ్మకం అని పవన్ వెల్లడించారు. గతంలోనూ వైజాగ్ లో ప్రధాని మోదీ గారు పిలిచినపుడు కూడా రాష్ట్ర అంశాల మీదనే చర్చ జరిగింది. నేను కేంద్ర పెద్దలను కలిసినపుడు రాష్ట్రం, దేశ ప్రయోజనం గురించి మాట్లాడతానే తప్ప కేసులు మాఫీ కోసమో, అప్పులు కోసమో కాదు అని పవన్ వివరించారు.
జగన్ పోవాలి.. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. నన్ను ఢిల్లీలోనూ విలేకరులు సీఎం అభ్యర్ధి మీరేనా అని అడిగారు. నేను చెప్పేదొక్కటే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, అప్పులు లేని ఆంధ్రను సాధించేందుకు నేను శక్తివంచన లేకుండా పనిచేస్తాను. ఎన్నికల్లో పూర్తిస్థాయిలో కష్టించి పనిచేసిన తర్వాత వచ్చిన స్థానాలు, స్థానాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరూ అనేది నిర్ణయం ఉంటుంది. పరివర్తన తీసుకొచ్చే రాజకీయాలు నేను చేస్తాను. ప్రజలను చైతన్యవంతం చేసే రాజకీయాలు నా లక్ష్యం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే నిర్ణయాలు మా వైపు నుంచి ఉంటాయి.
మహిళల రక్షణకు అభయమిచ్చే అధికారం, అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే అధికారం, యువతకు ఉపాధి మార్గం చూపే అధికారం, ప్రజలకు అండగా ఉండే అధికారం కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది అని పవన్ వెల్లడించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, అంశాల కోసం జనసేన పాలన ఉండదు. జగన్ ను ఇంటికి పంపించే రోజు దగ్గర్లోనే ఉంది. కుదిరితే ఇంటికి పంపిద్దాం లేదూ చర్లపల్లి జైలుకు పంపిద్దాం. రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ముద్ర బలంగా ఉంటుంది అని పవన్ స్పష్టం చేసారు.